అటవీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభం
Published Mon, Jan 2 2017 10:14 PM | Last Updated on Wed, Sep 26 2018 6:01 PM
లాలాచెరువు (రాజానగరం) :
అటవీ శాఖ ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించడం ముఖ్యమైన అంశమని రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి ఆర్‌జీ కల్గాటి అన్నారు. ఆయన సోమవారం లాలాచెరువు ప్రాంతీయ అటవీ పరిశోధనా కార్యాలయంలో అటవీ శాఖ ఉద్యోగుల శిక్షణా తరగతులను ప్రారంభించారు. రాష్ట్ర విభజనతో అటవీ శాఖ శిక్షణా సంస్థను కోల్పోవలసి వచ్చిందన్నారు. ఆ లోటును భర్తీ చేస్తూ నవ్యాంధ్రలోని అటవీ ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రంలో కొంత భాగాన్ని కేటాయించడం హర్షణీయమన్నారు. దీంతో మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇదే శాఖలో పనిచేసి రిటైరైన ఉద్యోగులను ఫ్యాకల్టీగా తీసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన 18 మంది ఎఫ్‌బీఓలు, 18 మంది ఎఫ్‌ఎస్‌ఓలు ఈ శిక్షణకు హాజరయ్యారు. వీరిలో ఎఫ్‌బీఓలకు ఆరు నెలలు (ఒక సెమిస్టర్), ఎఫ్‌ఎస్‌ఓలకు ఏడాది (రెండు సెమిస్టర్లు) శిక్షణ ఇస్తారు. అటవీ శాఖ అధికారులు ఎం. సుధాకర్, ఎం. రవికుమార్, పి. ప్రభాకర్, వి. శ్రీహరిగోపాల్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement