పోగొట్టుకున్న బ్యాగ్ దొరికిందిలా..
బాధితులకు చేరిన రూ.1.50 లక్షల విలువైన వస్తువులు
సమయస్ఫూర్తిగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లు
సత్తెనపల్లి : పుష్కరాలకు సత్తెనపల్లి మండలం గర్నెపూడి గ్రామానికి చెందిన నీలా స్రవంతి కుటుంబ సభ్యులు ఆదివారం అమరావతికి వెళ్ళారు. పుణ్య స్నానమాచరించి దైవదర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. అమరాతి నుంచి పెదకూరపాడు వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి గర్నెపూడికి ఆటోలో వెళ్లారు. తీరా ఇంటికి వెళ్ళాక బ్యాగ్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో పెదకూరపాడు బస్టాండ్ వద్దకు ఉరుకులు పరుగులు తీశారు. బ్యాగ్ కనిపించకపోవడంతో ఆవేదనకు లోనయ్యారు. అదే సమయంలో పుష్కర విధులు ముగించుకొని అమరావతి నుంచి సత్తెనపల్లి వస్తున్న పట్టణానికి చెందిన కానిస్టేబుళ్ళు కాకిరాల రవి కుమార్, నేలపాటి ప్రవీణ్‌బాబు బాధితులతో మాట్లాడారు.
ఆర్టీసీ బస్సులో బ్యాగ్ మరిచిపోయామని, అందులో రూ.1.50 లక్షలు విలువ గల బంగారం, నగదు, విలువైన ఎంకామ్ సర్టిఫికెట్లు, ఇతర లగేజీ ఉన్నట్లు చెప్పారు. దీంతో వారిని తమ ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని సత్తెనపల్లి చేరుకున్నారు. బస్సులను ఆపి తనిఖీ చేయడంతో బ్యాగ్ కనిపించింది. వస్తువులన్నీ భద్రంగా ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించి బాధితులకు సాయపడిన కానిస్టేబుల్స్‌ను సీఐ ఎస్.సాంబశివరావు ప్రత్యేకంగా అభినందించారు.