తాడిపూడి ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో తాడిపూడి ఎత్తిపోతల పథకానికి పంట బోదెల ఏర్పాటు ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. శనివారం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 11 మండలాల్లో ఏర్పాటు చేయనున్న ఫీల్డ్ ఛానల్స్, మిగిలిన పనులను త్వరగా చేపట్టి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పంట బోదెలను ఆయా గ్రామ రెవెన్యూ బ్యాప్‌లపై గుర్తించాలని, ప్రతి గ్రామంలోనూ పూర్తిస్థాయిలో పంట బోదెలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కొందరు రైతులు కొత్త చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారని కొందరు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఒకసారి అవార్డు పాసైన తరువాత పాత వారికి కొత్త చట్టం ప్రకారం సొమ్ముల చెల్లించడం ఎట్టి పరిస్థితుల్లోనూ వీలుకాదని స్పష్టం చేశారు. అవార్డు పాసైన తేదీ నాటికి ఉన్న నిబంధనల మేరకు మాత్రమే నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జేసీ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, డీఆర్వో ప్రభాకరరావు, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్, నరసాపురం సబ్‌కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో షాన్‌మోహన్, ఆర్డీవోలు నంబూరి తేజ్‌భరత్, శ్రీనివాసరావు, లవన్న, పోలవరం కుడికాలువ ఎస్‌ఈ శ్రీనివాస యాదవ్, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రణాళిక
జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక 15 రోజుల్లో రూపొందించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నిర్మలను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏలూరు దత్తాశ్రమం వద్ద తమ్మిలేరుపై బ్రిడ్జి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం తదితర పట్టణాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు. అందుకోసం ప్రత్యామ్నాయ రహదారి వ్యవస్థకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఏలూరులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు శనివారపుపేట దత్తాశ్రమం నుంచి తమ్మిలేరుపై రూ.23 కోట్లతో వంతెన నిర్మిస్తామని, దీని ద్వారా శనివారపుపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను మేడిశెట్టివారిపాలెం రోడ్డు వైపునకు మళ్లిస్తామని కలెక్టర్ చెప్పారు. తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్డు పరిధిలో ఆరు ఇంటర్నెల్ రహదారుల కనెక్టవిటీ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని, భీమవరంలో బైపాస్ రోడ్డు నిర్మాణంతో పాటు రోడ్లను విస్తరిస్తామన్నారు. జేసీ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జేసీ షరీఫ్ పాల్గొన్నారు.