ప్రభుత్వంపై సమరానికి రైతులు సై
ప్రభుత్వంపై సమరానికి రైతులు సై
Published Wed, Nov 9 2016 6:33 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
–చింతలపూడిలో నేడు జిల్లా రైతు సదస్సు
చింతలపూడి: ప్రభుత్వంపై సమరానికి చింతలపూడి ఎత్తిపోతల పధకం రైతులు సమాయత్తమవుతున్నారు. గురువారం చింతలపూడిలో జరిగే జిల్లా రైతుల సదస్సు ఇందుకు వేదిక కానుంది. జిల్లాలోని రైతు సంఘాల ముఖ్య నాయకులు, స్వచ్ఛంద సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనేలా మార్కెట్ కమిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సులో రాజకీయాలకు అతీతంగా జిల్లా రైతుల ప్రయోజనాలకు కాపాడే విధంగా పోరాటానికి నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా మొదటి దశ పనులే ఇంకా పూర్తి కాని ఈ పధకానికి ప్రభుత్వం ఇటీవల రెండో దశ మంజూరు చేయడంతో జిల్లా రైతుల్లో ఆందోళన కలిగిస్తూంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఈ పధకం ఏడేళ్ళు పూర్తయినా ఇంతవరకు పూర్తి కాలేదు. పరిహారం విషయంలో రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో భూసేకరణ అధికారులకు సమస్యగా మారింది. ఈ నేపధ్యంలోనే రైతులు గత మేనెలలో ఆందోళనకు దిగి కాల్వ త్రవ్వకం పనులను అడ్డుకోవడంతో ఏడు నెలలుగా పనులు నిలిచి పోయాయి.
పెరిగిన వ్యయం ః
మొదటి దశలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పభుత్వం మంజూరు చేసిన రు 17.01 కోట్లతో పాటు ప్రభుత్వం రెండో దశలో కృష్ణా జిల్లాలో మరో 2.80 లక్షల ఎకరాలను చేర్చి ప్రాజెక్టు వ్యయాన్ని రు 4,909.80 కోట్లకు పెంచారు. ఇందులో మొదటి దశ సామర్ధ్యాన్ని పెంచడం వల్ల మరో 808 కోట్లు అదనంగా ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఇక రెండో దశ పనులకు రు 2,400 కోట్లు అంచనా కట్టారు. దీంతో పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో మొత్తం 4.80 వేల ఎకరాలకు సాగు నీరు. త్రాగునీరు అందే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. చింతలపూడి ప్రధాన కాలువ ద్వార తొలుత 2 వేల క్యూసెక్కుల నీరు పారడానికి వీలుగా 24 మీటర్ల వెడల్పు, 3.2 మీటర్ల లోతు ఉండేలా త్రవ్వకం పనులు చేపట్టారు. ఇప్పుడు సామర్ధ్యం పెరగడంతో మరో మూడు మీటర్ల మేర కాల్వ ఎత్తు పెంచడానికి నిర్ణయించారు. అయితే కాల్వ ఎత్తు పెంచితే కాల్వపై కట్టే వంతెనలు, తూములు నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే జల్లేరు వద్ద తొలుత 8 టీఎంసీల సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్‌ను నిర్మించాలని భావించారు. తీరా అది 20 టీఎంసీల సామర్ధ్యానికి పెంచుతూ ప్రతిపాదనలు పంపించారు.
పేరుకే చింతలపూడి ఎత్తిపోతల ః
పేరుకు చింతలపూడి ఎత్తిపోతల పధకం అయినా ఈ పధకం వల్ల ఎక్కువ ప్రయోజనం కృష్ణా జిల్లాకు కలుగుతూందని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ కృష్ణా జిల్లాకు చెందిన ప్రతినిధి కావడంతో ఈ నీటిని తమకు కాకుండ తరలించుకు పోవడానికి కుట్రలు పన్నుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్ధితిలో జిల్లా రైతుల అవసరాలు తీరాకే కృష్ణా జిల్లాకు నీరు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత కాని ఎంపీ మాగంటి బాబు , ఇతర ప్రజా ప్రతినిధులు కాని ఈ ప్రాజెక్టుపై ఇంతవరకు నోరు మెదపక పోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో మంజూరైన పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాలోని పంటలకు నీరు ఇచ్చాకే మిగులు వాటర్ కృష్ణాకు ఇవ్వాలని రైతులు yì మాండ్ చేస్తున్నారు.
భూసేకరణకు ససేమీరా అంటున్న రైతులు
జిల్లాలో పట్టిసీమ కాల్వకు ఒకలా, చింతలపూడి ఎత్తిపోతల కాల్వ రైతులకు మరోలా నష్టపరిహారం అంద చేయడంతో రైతులు భూ సేకరణ కు అడ్డు పడుతున్నారు. జిల్లాలోని పట్టిసీమ ప్రధాన కాల్వ క్రింద రైతులకు ఎకరానికి రు 30 లక్షలకు పైగా చెల్లించి , చింతలపూడి మండలంలో ఎకరానికి 12 నుండి 15 లక్షలే ఇస్తామని చెప్పడం పట్ల రైతుల్లో అభ్యతరం వ్యక్తమవుతూంది.
ఒకే ప్యాకేజ్ అమలు చేయాలి
జిల్లాలోని ఎత్తిపోతల పధకాల రైతులందరికీ ఒకే ప్యాకేజి అమలు చేయాలి. జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతులతో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రితో మాట్లాడాలి. చింతలపూడి ఎత్తిపోతల పధకం ద్వార వచ్చే గోదావరి జలాలు పూర్తిగా జిల్లా రైతులు వినియోగించుకునేలా ఆదేశాలు ఇవ్వాలి.
అలవాల ఖాదర్‌బాబురెడ్డి చింతలపూడి ఎత్తిపోతల పధకం అఖిల పక్షం రైతు సంఘం అధ్యక్షులు
Advertisement