♦ అర్ధరాత్రి వేళ రైతు మృతి రాయిలాపూర్‌లో ఘటన
♦ వీధిన పడ్డ కుటుంబం విద్యుదాఘాతానికి రైతు బలి
కౌడిపల్లి: రాత్రి కరెంటు ఓ రైతు కొంపముంచింది. వరి పొలానికి నీరు పారబెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై రైతు ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున రాయిలాపూర్‌లో చోటుచేసుకుంది. రాయిలాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గయ్య, శంకరయ్య, కిష్టయ్య, రాములు నలుగురు అన్నదమ్ములు. వీరు వేరుగా ఉంటున్నారు. వీరికి 1.20 ఎకరాల పొలం ఉంది. పంచుకోగా ఒక్కొక్కరికి 15 గుంటలు వచ్చింది. బోరు ఉమ్మడిగా ఉంది. వంతుల వారీగా తమ వాటా పొలానికి నీరుపారబెట్టుకుంటున్నారు. తనవంతు రావడంతో కిష్టయ్య(45) సోమవారం అర్ధరాత్రి పొలానికి వెళ్లాడు. తెల్లవారుజాము రెండుగంటల ప్రాంతంలో కరెంటు రావడంతో మోటారు ఆన్ చేశాడు. మోటార్ నడవకపోవడంతో స్టాటర్‌ను పరిశీలిస్తుండగా కరెంటు షాక్‌తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
పెద్దదిక్కును కోల్పోయి ఆ కుటుంబం వీధిన పడింది. కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. కిష్టయ్యకు భార్య వీరమణి, కూతురు సంతోష, మాధవి, కొడుకు పవన్‌కుమార్ ఉన్నారు. ఇటీవల పెద్ద కూతురు సంతోష పెళ్లిచేశారు. కిష్టయ్య తల్లి శివ్వమ్మ(75) నెలరోజుల క్రితమే మరణించింది. అందరితో కలుపుగోలుగా ఉండే కిష్టయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి. సర్పంచ్ శంకరయ్య, మాజీ ఉపసర్పంచ్ సంజీవ్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం స్పందించి రైతు కుంటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.