
బాబూ.. కోట్లు ఇస్తేనే పదవి ఇస్తారా?
టీడీపీ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘చంద్రబాబూ.. కోట్ల రూపాయలు ఇస్తేనే పదవి ఇస్తారా..? నోట్ల కట్టలు గుమ్మరించి పదవులు కొనుగోలు చేయడం బీసీలకు చేతకాదు. అలాగని మీకు బీసీలంటే అంత అలుసా? పార్టీ పుట్టినప్పటి నుంచి అండగా నిలిచిన బీసీలకు అన్యాయం చేశారు. ఇలా మోసం చేయడం దారుణం. మేము (బీసీలు) తలుచుకుంటే పార్టీ పునాదులు పెకిలిస్తాం’ అని రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తీవ్రంగా హెచ్చరించారు.
రాజ్యసభ సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేశారంటూ వివిధ బీసీ సంఘాల నేతృత్వంలో గురువారం కర్నూలులో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. దీనికి నేతృత్వం వహించిన కేఈ ప్రభాకర్.. పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు.. పదవులను ఎవరో తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకోమని ధ్వజమెత్తారు. రాజ్యసభ సీటు కేటాయించక పోవడం తన ఒక్కడికే నష్టం కాదని, బీసీ జాతికే అన్యాయం అని కేఈ ప్రభాకర్ మండిపడ్డారు.