మాజీ మంత్రి మాణిక్‌రావు కన్నుమూత
* అనారోగ్యంతో చికిత్సపొందుతూ హైదరాబాద్‌లో తుదిశ్వాస
* రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన మాణిక్‌రావు
* నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలుపు
* 14 ఏళ్ల పాటు వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు
* తెలంగాణ తొలి ఉద్యమంలో కీలక పోరు
తాండూరు, హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మల్కోడ్ మాణిక్‌రావు (86) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య శశిప్రభ, ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆయన... పీవీ నర్సింహారావు, జలగం వెంగళరావు, చెన్నారెడ్డి హయాంలో దాదాపు 14 ఏళ్ల పాటు వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా వ్యవహరించారు. కొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటు న్న మాణిక్‌రావు సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. 8 నెలల క్రితం పక్షవాతం రాగా.. అప్పటి నుంచీ ఆరోగ్యం క్షీణించింది. వారం క్రితం పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.
1969లో తొలిసారి ఎమ్మెల్యేగా..
మాణిక్‌రావు 1964లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో అరెస్టై 3 నెలల పాటు జైల్లో ఉన్నారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి.. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1972లో రెండోసారి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికై జలగం వెంగళరావు సర్కారులో వాణిజ్య,సమాచార శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.1978లో మూడోసారి శాసనసభకు ఎన్నికై .. చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్‌అండ్‌బీ, వాణిజ్య శాఖల మంత్రిగా పనిచేశారు. 1983లో నాలుగోసారి విజయం సాధించారు. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా, 1999లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా పరాజయం పాలయ్యారు.
తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తాండూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. మాణిక్‌రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని తపించేవారని, రాష్ట్ర ఏర్పాటుతో తన కల సాకారమైందని ఆనందించారని ఆయన సన్నిహితులు చెప్పారు. కాగా మాణిక్‌రావు మృతి కాంగ్రెస్‌కు తీరని లోటని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. సోమాజిగూడలోని నివాసంలో మాణిక్‌రావు భౌతికకాయాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేత షబ్బీర్‌అలీ, రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు సందర్శించి, నివాళులు అర్పించారు. అనంతరం మాణిక్‌రావు కుటుంబ సభ్యులు భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 2:30 గంటలకు తాండూరుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.