
తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన
వెలగపూడిలో భూమిపూజ చేసిన సీఎం చంద్రబాబు
జూన్ 15లోగా నిర్మాణం పూర్తి.. ఉద్యోగుల తరలింపు
సాక్షి, విజయవాడ బ్యూరో: గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతం వెలగపూడి గ్రామంలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే తాత్కాలిక సచివాలయానికి బుధవారం ఉదయం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. జూన్ 15వ తేదీలోగా దీని నిర్మాణం పూర్తి చేసి ఉద్యోగులను ఇక్కడికి తరలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతి నగరం నుంచే పరిపాలన సాగుతుందన్నారు. రాష్ట్రం లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన ఉంటుందన్నారు.
భవనాన్ని 8 అంతస్తుల్లో నిర్మించేందుకు నిర్ణయించామనీ, రాజధాని నిర్మాణం పూర్తయ్యాక ఇక్కడ పనిచేసే ఉద్యోగులను వారివారి కార్యాలయాలకు పంపి ఈ భవనాన్ని ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తామన్నారు. తనతో పాటు మంత్రులు విజయవాడలో, అధికార యంత్రాంగం హైదరాబాద్‌లో ఉంటే పరిపాలన సజావుగా జరగదన్నారు. అలాగని ఉన్నపళంగా ఉద్యోగులు, ఉన్నతాధికారులందరినీ ఒకేసారి విజయవాడ రమ్మనడం కూడా సరికాదన్నారు. వీరందరి కోసం రాజధాని తొలి నిర్మాణంగా రూ.200 కోట్లతో ప్రభుత్వ భవన సముదాయాన్ని నిర్మించతలపెట్టామని చంద్రబాబు చెప్పారు. ఇది తాత్కాలిక సచివాలయం కాదని, శాశ్వత భవన సముదాయమన్నారు.
భావితరాల భవిష్యత్తుకు వేదిక
వెలగపూడిలో నిర్మిస్తున్న భవనం భావితరాల భవిష్యత్తుకు వేదికని బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు దేశ విదేశాల పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన సదస్సులో రూ.4.70 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఎంవోయూలు కుదుర్చుకున్నారని చెప్పారు. కొంతమంది రాష్ట్ర అభివృద్ధిని చూసి భరించలేక పోతున్నారని విమర్శించారు. అభివృద్ధికి సహకరించే మనసు లేకపోతే గమ్మునుండాలన్నారు. రాజధాని రైతులకు ఏవైతే హామీలిచ్చామో వాటన్నిటినీ అమలు చేస్తామని సీఎం అన్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చే 15 వేల మంది ఉద్యోగుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని గుంటూరు, విజయవాడకు చెందిన స్థానికులు ఇళ్ల అద్దెలను గణనీయంగా పెంచవద్దంటూ విజ్ఞప్తి చేశారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ కొత్త భవనం భవిష్యత్తులో వివిధ అవసరాలకు వినియోగించుకునేలా ఉంటుందన్నారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుధ్ధప్రసాద్,మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, పైడికొండల మాణిక్యాలరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి,తదితరులు ప్రసంగించారు. శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం.. పవిత్ర స్థలాల నుంచి తెచ్చిన మట్టి, జలాలను చల్లిన అనంతరం మోకరిల్లి నమస్కరించారు.
అంతా తాత్కాలికమే..
తాత్కాలిక సచివాలయానికి రూ.200 కోట్లు వెచ్చించనుండటంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చంద్రబాబు ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. తాత్కాలిక సచివాలయ నిర్మాణం కోసం రెండు, మూడు ప్రాంతాలను పరిశీలించిన ప్రభుత్వం చివరకు తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. టెండర్లు ఆహ్వానించింది. ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలకు 12 శాతం ఎక్సెస్‌కు కాంట్రాక్టులు కట్టబెట్టింది. మార్కెట్‌లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.2 వేలు ఖర్చవుతుంటే, తాజాగా చదరపు అడుగుకు రూ.3,500 వెచ్చించేందుకు సిద్ధమయ్యింది. పట్టిసీమ, పోలవరం, గోదావరి ప ష్కరాల పనులకు, ప్రత్యేక విమానాల్లో పర్యటనలకు బాబు ప్రభుత్వం వందల కోట్ల ను దుబారా చేస్తుండటంపై ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వం మాట మార్చింది. నిన్నటివరకు తాత్కాలిక సచివాలయం అన్న చంద్రబాబు.. శంకుస్థాపన సందర్భంగా శాశ్వత భవన సముదాయమం టూ చెప్పుకొచ్చారు. అదే అయితే తాత్కాలికమని ఎందుకు చెప్పారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. శాశ్వత సముదాయానికి హ డావుడి శంకుస్థాపన దేనికన్న ప్రశ్నా తలెత్తుతోంది.