నెత్తురోడిన హైవే.. | Four killed in road accident in Nalgonda Dist | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన హైవే..

Published Sat, Feb 25 2017 10:30 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

నెత్తురోడిన హైవే.. - Sakshi

నెత్తురోడిన హైవే..

రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం
లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు..
కారుబోల్తా కొట్టడంతో మరొకరు..
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇంకొకరు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దుర్ఘటనలు


మితిమీరిన వేగానికి తోడు నిర్లక్ష్యం.. నిద్రమత్తు.. కారణాలు ఏవైతేనేం రెప్పపాటులో నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పండగపూట రహదారులు నెత్తురోడాయి. శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందగా..మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.

కట్టంగూర్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడలోని ఆటోనగర్‌కు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు గురువారం అ«ర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాదు నుంచి 39 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వేకువజాము కావడంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు.

రెప్పపాటులో..
విజయవాడకు బయలుదేరిన బస్సు మార్గమధ్యలో కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ శివారుకు చేరుకోగానే ముందు వెళ్తున్న రెండు లారీల డ్రైవర్లు అకస్మాత్తుగా తమ వాహనాల బ్రేకులు వేశారు. అయితే వాటి వెనకే ఉన్న ఆర్టీసీ మితిమీరిన వేగంతో ఉండడంతో అదుపుతప్పి ముందు ఆగి ఉన్న లారీని రెప్పపాటులో బలంగా ఢీకొట్టింది.

హాహాకారాలు.. ఆర్తనాదాలు..
నిద్రలో నుంచి తేరుకున్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.దీంతో అందులో ఉన్న ప్రయాణికులు రక్షించండి అంటూ చేసిన హాహాకారాలు.. ఆర్తనాదాలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి.

ప్రమాద శబ్దం విని..
లారీని వెనుక నుంచి బస్సు వేగంగా ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో గ్రామస్తులు ఘటన స్థలం వద్దకు పరుగున వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే లారీలో ఉన్న యాసిడ్‌ క్యాన్లు పగిలి లీకేజీ కావటంతో దర్గంధం వెలువడింది. ప్రయాణికులకు రక్షించేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా సాధ్యపడలేదు. వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని కేతేపల్లి టోల్‌ప్లాజ్‌ నుంచి క్రేన్‌ను రప్పించి తాడు సహాయంతో 100 ఫీట్ల వెనకకు బస్సును లాగారు. అప్పటికే డ్రైవర్‌ వెనక సీట్లో ఇరుక్కుపోయిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కొండాపురం గ్రామానికి చెందిన వెంబడి గణేష్‌(24) అక్కడికక్కడే మృతిచెందాడు.  మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న ముగ్గురు..
ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న న్యూజీవీడుకు చెందిన బస్సు డ్రైవర్‌ వై.సత్యనారాయణ, హైదరాబాదులోని కొండాపూర్‌కు చెందిన గోవిందరాజు సుశీల(50), కోదాడకు చెందిన బూక్యా సురేష్‌(23) కాసేపటికే మృతిచెందారు. కట్రోజు సురేష్, ఊదారపు రవికుమార్, యాండ్రపు పవన్‌కుమార్, గోవిందరాజు వెంకటేశ్వరావు, బీమారపు ప్రసాద్, శీలం మధుకర్, కామేశ్వర సాంబశివరావు, కర్నె నర్సింహ్మ, మేషబోయిన కాటంరాజు, షహద్‌లు చికిత్స పొందుతున్నారు.

 లారీ దగ్గరకు వెళ్లేందుకు భయపడిన స్థానికులు
అకస్మాత్తుగా లారీని బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో లారీలో ఉన్న పార్సిల్‌ సామగ్రి చెల్లా చెదురయ్యాయి. అందులోని యాసిడ్‌ క్యాన్లు లీకయ్యాయి. దీంతో దగ్గరకు వెళితే కళ్లు మంటలు మండుతుండడంతో ఎవరూ దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు. పోలీసులు నకిరేకల్‌ నుంచి ఫైరింజన్‌ను తెప్పించి వాటర్‌లో రోడ్డును శుభ్రం చేసి అక్కడి నుంచి లారీని తొలగించారు.  ఫోరెన్సిక్‌ నిపుణులు లారీ సామగ్రిని పరిశీలించారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ  ప్రకాశ్‌రెడ్డి, సీఐ విశ్వప్రసాద్‌లు పరిశీలించారు. నార్కట్‌పల్లి, కట్టంగూర్, కేతేపల్లి, నల్లగొండ ఎస్‌ఐలు కూడా అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు
చికిత్స పొందు తూ కామినేని ఆస్పత్రిలో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకుని వారి బంధువులు, కుటుంబ సభ్యులు నకిరేకల్‌కు చేరుకున్నారు. తమ వారి మృతదేహాలపై పడి రోదించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. దీంతో ఆస్పత్రి ఆవరణలో విషాదం అలుముకుంది.  

గుర్తుతెలియని వాహనం ఢీకొని..
వలిగొండ : గుంటూరు జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన కొక్కుల రామంజనేయులు (23) వృత్తిరీత్యా భవన నిర్మాణ కార్మికుడు. ఇతను జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని మొలుగు వద్ద పనిచేస్తున్నాడు.  పండుగ నేపథ్యంతో స్వగ్రామానికి బైక్‌పై మిత్రుడు మందని ఆంటోనితో కలిసి బయలుదేరాడు. మార్గమధ్యలో వలిగొండలోని పెద్దమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో రామజంనేయు లు,ఆంటోనికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు భువనగిరి ఆస్పత్రికి తరలించగా రామంజనేయులు మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు అదుపుతప్పడంతో..
కొండమల్లేపల్లి : ప్రకాశం జిల్లా పామూరు మండలానికి చెందిన గాజుల శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ నుంచి శివరాత్రి పండుగకు గాను సొంతూరుకు కారులో వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో మండల పరిధిలోని చెన్నారం గేటు వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్‌ సంతోష్‌రెడ్డి తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement