బోల్తాపడిన లారీలు
♦ ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు
♦ జాతీయ రహదారిపై ఘటన
మహబూబ్‌నగర్, భూత్పూర్ (దేవరకద్ర) : ఓ డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం, నిద్రలేమి కారణంతో నాలుగు వాహనాలు ఒకదాని వెనక మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని పోతులమడుగు వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మిర్యాలగూడ నుంచి కేరళకు బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీని పోతులమడుగు వద్ద జాతీయ రహదారిపై వెళ్తుండగా వెనుక నుంచి ఖాళీ డబ్బాల లోడ్‌తో వెళ్తున్న లారీ ఓవర్‌టేక్ చేయబోయి.. అదుపు తప్పి బలంగా ఢీకొంది. దీంతో రెండు లారీని రోడ్డు పక్కనే కింద పడిపోయాయి.
దీంతో ఖాళీ డబ్బాల లోడ్‌తో వెళ్తున్న పంజాబ్‌కు చెందిన జగ్‌దార్‌సింగ్(45) అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ అనూష్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన లారీలోని ఖాళీ డబ్బాలు రోడ్డు మధ్యలో పడటంతో హైదరాబాద్ నుంచి గొర్రెల లోడ్‌తో అనంతపురం వైపు వెళ్తున్న డీసీఎం అకస్మాత్తుగా బ్రేక్ వేసింది. వెనకే మరో గొర్రెల లోడ్‌తో వస్తున్న డీసీఎం ఢీకొట్టడంతో డీసీఎంలో ఉన్న అనంతపురం జిల్లా చెదుల్లా మండలం బుక్కరాయపల్లి గ్రామానికి చెందిన గొర్రెల యజమాని రుసింగప్ప, ఆంజనేయులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను 108, ఎల్‌అండ్‌టీ అంబులెన్స్ వాహనాల్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు.
నిద్రలోనే అనంత లోకాలకు..
ఖాళీ డబ్బాల లోడ్‌తో వెళ్తున్న లారీలో ఉన్న పంజాబ్‌కు చెందిన జగ్‌దార్‌సింగ్ నిద్రలోనే మృత్యువాత గురికావడంతో అటుగా వెళ్తున్న వారు ఆవేదనకు గురయ్యారు. లారీ డ్రైవర్ లారీలో రెండు కాళ్లు ఇరుక్కోగా రెండు గంటల పాటు నరకయాతన అనుభవించారు. లారీ ముందు భాగం అతికష్టంగా తొలగించి డ్రైవర్‌ను ఎల్‌అండ్‌టీ, పోలీసు సిబ్బంది బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ పేర్కొన్నారు.