రక్తమోడిన రైలు పట్టాలు
-
వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతి
నెల్లూరు(క్రైమ్) : నగరంలోని రైలుపట్టాలు గురువారం రక్తమోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు రైలుప్రమాదంలో మృతిచెందగా ఓ యువతికి గాయాలైయ్యాయి. వివరాలు.. నక్కళోళ్ల సెంటర్‌లో పెయింట్ పనులు చేసే అరవ ప్రకాష్(40), విజయమ్మ దంపతులు నివసిస్తున్నారు. వారికి ముగ్గురు కుమారులు. ప్రకాష్ గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లేందుకు ఇంటి సమీపంలోని సులభ్‌కాంప్లెక్స్ వద్దకు వెళ్లాడు. దానిని తాళం వేసి ఉండటంతో సమీపంలోని రైలుపట్టాల వద్దకు వెళ్లాడు. పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలు అతడిని ఢీకొంది. ఈఘటనలో ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్సార్ ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు.
రైలుఢీకొని యువకుడు..
పశ్చిమబెంగాల్‌కు చెందిన శుభంకర్ బోర్దాలై(24) నెల్లూరులోని కామాటివీధిలో ఉంటూ బంగారు పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఏడాది క్రితం పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఖైజురీ ప్రాంతానికి చెందిన రాఖీ బోర్దాలైతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఏడోనెల గర్భిణి. బుధవారం రాత్రి 8.30 గంటల వరకు శుభంకర్ స్నేహితులతో గడిపాడు. అనంతరం సినిమాకు వెళుతున్నానని చెప్పి అక్కడ నుంచి ఎస్2 థియేటర్ వద్దకు వచ్చాడు. థియేటర్ ఎదురుగా ఉన్న రైల్వేట్రాక్ వద్ద మూత్రవిసర్జనకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు గుర్తుతెలియని రైలు అతడిని ఢీకొని వెళ్లిపోయింది. ఈఘటనలో శుభంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. శుభంకర్ ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం మృతదేహం రైలుపట్టాలపై ఉందని తెలిఽసి అక్కడి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్సార్ ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
పట్టాలు దాటుతూ..
కడపకు చెందిన వసంతకుమారి(55)కి బాలాజీ, భాగ్యలక్ష్మిలు పిల్లలు. బాలాజీ నెల్లూరు రామలింగాపురంలో నివాసముంటూ మహేంద్ర ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పదిరోజుల క్రితం వసంతకుమారి తన కుమార్తెతో కలిసి బాలాజీ వద్దకు వచ్చింది. గురువారం ఉదయం తల్లి, కుమార్తెలు కూరగాయలు తీసుకువచ్చేందుకు ఇంటినుంచి నడుచుకుంటూ ఏసీ కూరగాయాల మార్కెట్‌కు బయలుదేరారు. సౌత్‌రైల్వేస్టేషన్ సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలుపట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలు వారిని ఢీకొని వెళ్లిపోయింది.ఈ ఘటనలో వసంతకుమారి అక్కడికక్కడే మృతిచెందగా, భాగ్యలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు భాగ్యలక్ష్మిని 108 సాయంతో చికిత్స నిమిత్తం నారాయణ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వరలక్ష్మి పరిశీలించారు. డీఎస్సార్ ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
సౌత్ రైల్వేస్టేషన్‌లో..
నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్‌లో గురువారం సాయంత్రం గుర్తుతెలియని యువతి అనుమానాస్పద స్థితిలో రైలుపట్టాలపై మృతిచెందింది. మృతురాలు 20 ఏళ్ల వయస్సు ఽకలిగి నలుపు రంగు టాప్, పింక్ కలర్ లోయర్ ధరించి ఉంది. ప్రమాదం జరగక ముందు మృతురాలితో ఓ యువకుడు రైల్వేస్టేషన్ వద్ద ఘర్షణ పడ్డాడని, అనంతరం ఏం జరిగిందో తెలియదుగానీ ఆమె రైలుపట్టాలపై పడిఉందని స్థానికులు తెలిపారు. ఆమె ప్రమదవశాత్తు రైలు కిందపడిందా? లేదా ఆ యువకుడు ఆమెను తోసివేశాడా అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులకు దీనిపై సమాచారం లేదు.