గ్రూప్–2 మెయిన్స్‌కు ఉచిత కోచింగ్
Published Mon, May 29 2017 11:50 PM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఎస్‌సీ, బీసీ–సీ కులాలకు చెందిన అభ్యర్థులకు గ్రూప్–2 మెయిన్స్‌కు ఉచిత కోచింగ్‌ను ఇప్పించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ప్రకాష్‌రాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోచింగ్‌కు గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఒకటిన్నర నెలల పాటు తిరుపతిలోని డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, శ్రీ విద్య ఐఏఎస్ అకాడమీలో శిక్షణ ఇస్తామని తెలిపారు. దరఖాస్తు ఫారాలు, పూర్తి వివరాలను http;//www.chittor.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా పొందిన దరఖాస్తును పూర్తి చేసి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ నెల 31వ తేదిలోగా అందించాలన్నారు. అభ్యర్థులు జిల్లాకు చెందిన వారై ఉండాలని, కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల లోపు ఉండాలన్నారు. దరఖాస్తుకు గ్రూప్–2 ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్, పొందిన మార్కుల జాబితా నకలు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, తెల్లరేషన్ కార్డు/ ఆదాయ ధృవీకరణ పత్రం, విభిన్న ప్రతిభావంతులైతే 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలను జతచేసి అందించాలన్నారు.
Advertisement