నల్లగొండ టూటౌన్ : సమాజంలో ఉన్న అందరికీ నాణ్యమైన, ఉచితమైన, సమానత్వమైన విద్య అందాలని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో 2వ రోజు ఆదివారం నిర్వహించిన డీటీఎఫ్ 4వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభల బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్పొరేట్ విద్య తెలంగాణలో వేల్లూనుకుపోరుుందని ఈ విధానం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం పడి మోయలేని పరిస్థితుల్లో అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. స్కూళ్ల ఫీజుల భారం తగ్గాలని అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ర్యాంకులు రాలేదనే వేధింపుల కారణంగా ఇటీవల కాలంలో అనేక మంది చనిపోతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కలిచివేస్తున్నాయన్నారు. విభజించి చదువులు చెబుతున్నారని, ఇది మంచి సంస్కృతి కాదన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో రోజుకో కండీషన్, సర్క్యూలర్ల విధానంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు.
ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వాలు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలపై కచ్చితంగా మాట్లాడాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విజయగాథలు, ఉపాధ్యాయులు అందిస్తున్న విద్యా బోధన గురించి మాగ్జిన్ల ద్వారా వెలుగులోకి తేవాలన్నారు. వీటి ఆధారంగానే ఉపాధ్యాయుల పోస్టులు, ఇతర సౌకర్యాలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల గురించి లోతైన చర్చ జరగాలని, తక్షణమే ఇవాళ కామన్ స్కూల్ విధానం వస్తుందని నేను అనుకోవడం లేదన్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు విధి విధానం జరగాలని, జేఏసీ తరపు నుంచి యూనివర్సిటీలు, కాలేజీ విద్య గురించి ప్రత్యేకంగా రెండు రోజులు చర్చించినట్లు పేర్కొన్నారు. అందరికీ విద్యా, ఉపాధి, వైద్యం ఉచితంగా అందించినప్పుడే మెరుగైన సమాజం వస్తుందన్నారు. కామన్ విద్యా విధానానికి అందరం ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ విద్య లేనిదే ఆడపిల్లలు, కింది కులాల వారికి విద్య అందదన్నారు. రాష్ట్రంలో గుట్టలు, వన సంపద కరిగిపోతున్నాయన్నారు.
ఈ కార్పొరేట్ సంస్థల వల్ల మన బిడ్డలకు ఒక్క ఉద్యోగం కూడా రాదన్నారు. నల్లగొండ నుంచే ప్రభుత్వం విధానంపై మలిదశ పోరాటం ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యా అనేది అందరికీ సమానంగా నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత పాలకులదేనన్నారు. సమాజంలో వ్యాపారీకరణ, కాషారుుకరణను రూపుమాపాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసి మాతృభాషలోనే విద్యనందించాలన్నారు. అదే విధంగా డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిష్టప్ప, జ్వాల సంపాదకుడు గంగాధర్ కామన్ స్కూల్ విధానం, నాణ్యమైన విద్య, సమానత్వపు విద్య, కేసీ టూ పీజీ విద్య తదితర వాటిపై ప్రసంగించారు. అంతకుముందు డీవీకే రోడ్డు నుంచి డీటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం బజార్, బస్టాండ్, రామగిరి మీదుగా క్లాక్‌టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. సభలో కళాకారుల పాటలు, మహిళల కోలాటాలు ఆకట్టుకున్నారుు.
ఆర్థిక అవాంతరాలు పోతేనే సమానవిద్య
సమాజంలో ఆర్థిక అవాంతరాలు తొలగిపోతేనే కామన్ స్కూల్ విద్యా విధానం సాధ్యమని ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డీవీకే రోడ్డులో గల శివాంజనేయ ఫంక్షన్‌హాల్ శేషు ప్రాంగణంలో నిర్వహించిన రెండో రోజు డీటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో మాట్లాడారు. కామన్ స్కూల్ విద్యా విధానం రావాలంటే ప్రజల్లో బలమైన ఆకాంక్షను రగిలించాల్సిన అవసరముందన్నారు. ప్రజలు ప్రైవేటీకరణ విధానం వద్దని, అందరికీ సమాన విద్య, సమాన అవకాశాలు రావాలని కోరుకున్నప్పుడు ఆ దిశలో ఉద్యమాలు రావాలన్నారు. విద్యను అమ్మడం అప్రజాస్వామికమని విమర్శించారు. విరసం కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ మహిళలు తమ సమాన హక్కుల కోసం పోరాడాల్సిందేనన్నారు. అధ్యాపక జ్వాల సంపాదకుడు గంగాధర్ మాట్లాడుతూ కామన్ స్కూల్ విద్యా విధానం అమలు చేసి సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రిష్టప్ప, డీఈఓ చంద్రమోహన్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు ఎం.సోమయ్య, ఎం.వెంకటరాములు, పి.శాంతన్, పద్మలత, ఎం.శ్యామ్యూల్, వి.రాజిరెడ్డి, లింగారెడ్డి, ఎస్.భాస్కర్, విద్యాసాగర్‌రెడ్డి, వెంకులు, సత్తయ్య, భాస్కర్, దశరథరామారావు, లింగయ్య, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
అందరికీ ఉచిత విద్య అందాలి
Published Mon, Dec 12 2016 3:38 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement