కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు శిక్షణ
-
జేసీ–2 రాజ్‌కుమార్
నెల్లూరు(పొగతోట):
పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు సంబంధించి ఎస్టీ అభ్యర్థులకు నెల రోజులు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని జేసీ–2 రాజ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానిస్టేబుల్స్, జైలు వార్డెన్ల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అర్హులైన ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు నిర్ణయించినట్లు తెలిపారు. 18 నుంచి 27 ఏళ్ల వయసు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులైన ఎస్టీ అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హులన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులైన ఎస్టీ అభ్యర్థులు జైల్ వార్డెన్ పోస్టులకు అర్హులన్నారు. అభ్యర్థుల ఎత్తు 167.6 సెంటిమీటర్లు, ఛాతీ గాలి పీల్చిన తరువాత 86.3 సెంటీమీటర్లు ఉండాలన్నారు. పై అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీన 200 మార్కులకు రాతపరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 11 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగినవారు ఈ నెల 6, 7 తేదీల్లో స్థానిక ఏసీసూబ్బారెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు. వివరాలకు 98499 13074, 98499 09074లో సంప్రదించాలని తెలిపారు. సెట్నెల్ సీఈఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు.