ఖజానాకు తాళం ఇంకెన్నాళ్లు..?
ఇందూరు : ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఫ్రీజింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ విధించిన ఫ్రీజింగ్‌తో ఏ బిల్లులకు మోక్షం కలగడం లేదు. జూన్ 22న అమల్లోకి వచ్చిన ఫ్రీజింగ్ కొద్ది రోజుల పాటు తొలగిపోయింది. అయితే మళ్లీ జూలై మొదటి వారంలో ఆర్థిక శాఖ ఫ్రీజింగ్‌ను అమల్లోకి తెచ్చింది. నాటి నుంచి నేటి వరకు ట్రెజరీకి వేసిన తాళాలను ఆర్థిక శాఖ తెరవకపోవడంతో లెక్క లేనన్ని బిల్లులు చెల్లింపులకు నోచుకోలేవు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులు ట్రెజరీ కార్యాలయం చుట్టూ బిల్లుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. మొత్తం 40 రకాల హెడ్ అకౌంట్‌లకు చెందిన బిల్లులు నిలిచిపోయినట్లు సమాచారం. కాగా గ్రీన్‌చానల్ ద్వారా ప్రభుత్వ పథకాలైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సామాజిక పెన్షన్‌ల పథకాల నిధులకు సైతం తాళం పడింది.
ఇదిలా ఉండగా రెండు మూడు రోజుల క్రితం ఏకంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన బిల్లులే మంజూరు చేయలేదంటే రాష్ట్ర సర్కారు ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉందో అర్థమవుతోంది. ఇదిలా ఉండగా ఆర్థిక సంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు ఫ్రీజింగ్ నిబంధనను పెట్టడం, రెండు రోజుల పాటు తీసేసి మళ్లీ కొనసాగించడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంవత్సర ముగింపు సమయంలో ఫ్రీజింగ్‌ను పెడతారు, కానీ ఇలా నెల రెండు నెలల పాటు కొనసాగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇన్ని రోజులు ఆంక్షలు పెట్టి బిల్లులు నిలుపుదల చేయలేదని అంటున్నారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లకు సైతం..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిధులకు సైతం ఫ్రీజింగ్ తప్పలేదు. నెలకు పైగా వాటికి సంబంధించిన బిల్లులు ట్రెజరీలోనే మూలుగుతున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన స్కాలర్ షిప్‌లు, పంచాయతీల 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్, ఎస్‌ఎఫ్‌సీ పథకాల నిధులకు కూడా బ్రేక్ పడింది. ఉద్యోగుల జీపీఎఫ్, పెన్షన్‌లు, భవనాల, వాహన అద్దెలు, డైట్ చార్జీలు, టీఏ, డీఏలు, మెడికల్ బిల్లులు ఇలా చాలా వాటిని ట్రెజరీ అధికారులు తిప్పి పంపిస్తున్నారు. బిల్లులు చేసినా పాస్ కాకుండా బ్యాంక్‌కు సంబంధించిన సర్వర్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ నిలిపివేసింది.
రుణమాఫీయే కారణం
ట్రెజరీలో ఫ్రీజింగ్ నిబంధన అమలు కావడానికి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉండడం ఒక కారణమైతే, రెండో కారణం రైతులకు పంట రుణాలమాఫీ కూడా ప్రధాన కారణమేనని ట్రెజరీ అధికారులు అంటున్నారు. రుణమాఫీకి జిల్లాకు ఇప్పటి వరకు రూ. 196 కోట్లు మంజూరు కాగా, ఇందులో ఇప్పటి వరకు రూ. 98 కోట్ల చెల్లింపులు జరిగాయి. మిగతా నిధులు కూడా చెల్లింపులు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో రుణమాఫీ నిధులు చెల్లింపులు జరుగుతున్న నేపథ్యంలో ఇతర ఏ బిల్లులును పాస్ చేయడానికి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ట్రెజరికి విధించిన ఫ్రీజింగ్ నిబంధన ఇప్పట్లో తొలిగే విధంగా కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా బలపడడం, రుణమాఫీ నిధులు చెల్లింపులు పూర్తయిన తరువాతే అన్ని బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు నెలల వరకు ఫ్రీజింగ్ ఆంక్షలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆంక్షలు ఎప్పుటి వరకు ఉంటాయో చెప్పలేం..
– ప్రభాకర్ రెడ్డి, జిల్లా ట్రెజరీ కార్యాలయ అధికారి
ఆర్థిక శాఖ విధించిన ఫ్రీజింగ్ ఆంక్షలను అమలు చేస్తున్నాం. కొన్ని రోజులుగా ఫ్రీజింగ్ కొనసాగుతూనే ఉంది. రెండు మూడు బిల్లుల తప్పా మరే ఇతర బిల్లులను పాస్ చేయడం లేదు. ఉద్యోగులు తెచ్చిన బిల్లులను తీసుకోకుండా వెనక్కి పంపిస్తున్నాం. ఫ్రీజింగ్ నిబంధన ఎప్పుడు తొలగిస్తారనే విషయాన్ని ఆర్థిక శాఖ నుంచి ఆదేశాలు వస్తే తప్ప కచ్చితంగా చెప్పలేం.