పల్లె దరికి సురక్షిత జలం!
పల్లె దరికి సురక్షిత జలం!
Published Wed, Jan 18 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
రూ.802 కోట్లతో 423 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు
– ఎక్స్‌టర్నల్ ఎయిడ్ ప్రాజెక్టు కింద పనులు
– నీటి వనరుల పరిశీలనకు వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ బృందం
– ముచ్చుమర్రి, అలగనూరు, అవుకు ప్రాజెక్టుల పరిశీలన
కర్నూలు(అర్బన్): జిల్లాలోని 17 మండలాల్లో 423 గ్రామాలకు ఎక్స్‌టర్నల్ ఎయిడ్ ప్రాజెక్టు (ఈఏపీ) కింద రక్షిత నీరు అందించేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు రూ.802 కోట్ల అవసరమవుతాయని అంచనా వేశారు. జిల్లా యంత్రాంగం తయారు చేసిన ఈ ప్రతిపాదనలపై ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాలకు నీటిని అందించేందుకు ప్రతిపాదించిన నీటి వనరులను పరిశీలించేందుకు మంగళవారం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి నేతృత్వంలో టెక్నికల్ అడ్వైజర్ కొండల్‌రావు తదితరులు జిల్లాకు వచ్చారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జిల్లా పరిషత్ సీఈఓ బీఆర్ ఈశ్వర్, డీపీఓ కె. ఆనంద్, ఇరిగేషన్ సీఈ నారాయణరెడ్డి, ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, పీఆర్ ఎస్‌ఈ సుబ్బరాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరిబాబు తదితర ఇంజినీర్లతో ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన గ్రామాలకు నీటిని అందించేందుకు ప్రతిపాదించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, వెలుగోడు, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అవుకు జలాశయాలకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు.
ఏ మండలంలో ఎన్ని గ్రామాలకు అంటే..
పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల్లోని 91 గ్రామాలకు రూ.105 కోట్లు, దేవనకొండ, ఆస్పరి, గోనెగండ్ల, ఆదోని, ఆలూరు మండలాల్లోని 60 గ్రామాలకు రూ.105 కోట్లు, ప్యాపిలి, డోన్, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లోని 155 గ్రామాలకు రూ.300 కోట్లు, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజామల, అవుకు మండలాల్లోని 101 గ్రామాలకు రూ.250 కోట్లు, గడివేముల మండలంలోని 16 గ్రామాలకు రూ.42 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలతో కలిపి జిల్లాలో మొత్తం ఎక్స్‌టర్నల్ ఎయిడ్ ప్రాజెక్టు కింద రూ.1508 కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటిని అందించేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. మొదటి విడతలో ఈ ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన నీటి వనరులను పరిశీలించిన అనంతరం రెండో విడతలో మరి కొన్ని నీటి వనరులను పరిశీలించనున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్ అధికారులు ఆయా నీటి వనరులను పరిశీలించి గ్రామాలకు నీటిని అందించే అంశంలో సాధ్యసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదికలు అందించిన అనంతరం ఎక్స్‌టర్నల్ ఎయిడ్ ప్రాజెక్టు నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి అయితే వేసవిలో గ్రామాల్లో మంచి నీటి సమస్య తలెత్తదని సంబంధిత ఇంజినీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement