’సిరిసిల్ల సెస్‌లో నకి‘లీలలు’
-
ప్రమోషన్ల కోసం ఉద్యోగుల కక్కుర్తి
-
నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు
-
ముష్టిపల్లి ఏఎల్‌ఎం చంద్రయ్య సస్పెనషన్
-
మరికొందరిపై అనుమానం
సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల సెస్‌లో మరో అవినీతి బాగోతం వెలుగుచూసింది. టెండర్లు లేకుండా ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు కొనుగోలులో తలెత్తిన వివాదం సమసిపోకముందే..ఉద్యోగులు అక్రమ బాట్టారు. తప్పుడు పత్రాలు సమర్పించి ప్రమోషన్లు పొందారు. ఈ వ్యవహారం విచారణలో తేలడంతో ఎండీ నాంపెల్లిగుట్ట సిరిసిల్ల మండలం ముష్టిపల్లిలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న ఏ.చంద్రయ్యను శనివారం సస్పెండ్ చేశారు. గతేడాది హెల్పర్ నుంచి అసిస్టెంట్ లైన్‌మెన్‌గా ప్రమోషన్ పొందిన చంద్రయ్య నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాడు.
తేలింది ఒకటి..తేలాల్సినవి ఎన్నో..?
సెస్‌లో హెల్పర్లు, అసిస్టెంట్ హెల్పర్లు, పదోన్నతుల కోసం అక్రమ మార్గాలను అనుసరించినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రమోషన్ కోసం ఐటీఐ తత్సమాన కోర్సుల సర్టిఫికెట్లు అవసరంకాగా ఆయా అర్హతలు లేనివారు అక్రమబాట పడుతున్నారు. ఇటీవల సుమారు 160 మంది వరకు అసిస్టెంట్ హెల్పర్లు, హెల్పర్లు పదోన్నతులు పొందారు. కొంతమంది అర్హత లేకున్నా..ఎస్సెస్సీ, ఐటీఐ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది మార్చి 12న 37 మంది హెల్పర్లకు పదోన్నతులు కల్పిస్తూ..సెస్ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇందులో చంద్రయ్య ఇచ్చిన సర్టిఫికెట్లు నకిలీవని తేల్చారు. ఏఎల్‌ఎంలుగా ప్రమోషన్లు పొందిన మరో ఆరుగురు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తెలిసింది. ఉద్యోగాలు సమర్పించిన పత్రాలపై ప్రత్యేక అధికారితో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎండీ. నాంపెల్లిగుట్ట తెలిపారు.