నవ్వు‘తారు’
– పుష్కరాలు రాకముందే రహదారులు శిథిలం
– నెల రోజులకే పగుళ్లు, ఆపై ప్యాచింగ్ పనులు
– బాగున్న తారురోడ్డుపై మళ్లీ నిర్మాణం
ఆత్మకూరు: కృష్ణా పుష్కరాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన రహదారి పనులు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన టీడీపీ నాయకులకు వరంగా మారాయి. బీటీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. పుష్కరాలు కూడా రాక ముందే రహదారులు శిథిలమవుతున్నాయి. కోట్లాది రూపాయాలు స్వాహాకు గురవుతున్నా అడిగేవారే కరువయ్యారు. పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాల్సిన రహదారులు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఆత్మకూరు మండలంలో చేపట్టిన పనుల్లో అడుగడుగునా అక్రమాలే దర్శనమిస్తున్నాయి. నిబంధనల మేరకు పాత బీటీ రోడ్డును పూర్తిగా తొలగించి 40 ఎంఎం కంకకర వేసి రోలర్ తిప్పాలి. ఉదయం, సాయంత్రం క్యూరింVŠ చేస్తూ మళ్లీ రోలర్‌తో తిప్పి అనంతరం తారు వేయాలి. ఇదంతా తమకు వర్థించదంటూ పాత బీటీ రోడ్డుపైనే తారు మిక్సింగ్ వేసి నిధులు కాజేశారు. కొన్ని చోట్ల బీటీ రహదారికి ఇరువైపుల నాసిరకం కంకర వినియోగించారు.
నాణ్యత..కష్ణమ్మకెరుక
ఐదు కి.మీ. దూరం ఉన్న ఆత్మకూరు– కురుకుంద రహదారి నిర్మాణానికి పుష్కర నిధుల్లో రూ. 1.90 కోట్లు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పాత బీటీ రోడ్డుపైనే కొత్తగా మళ్లీ బీటీ రోడ్లు వేశారు. చకచక రోడ్డు వేసి తమ పని అయిపోయిందని కాంట్రాక్టర్ బిల్లు పొందాడు. అయితే 10 రోజులకే రహదారి పగుళ్లు ఇచ్చింది. అక్కడక్కడా గుంతలు కూడా పడ్డాయి. రహదారి నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు గుంతలు పడిన చోట ప్యాచింగ్ పనులు చేయించి చేతులు దులుపుకున్నారు. ప్యాచింగ్ పనులు కూడా తూతూమంత్రంగా చేయడంతో మూన్నాళ్లకే మళ్లీ గుంతలు పడ్డాయి. రూ. కోట్లాది రూపాయలతో చేపట్టిన రహదారి నాణ్యతను చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు.
అప్పుడు రూ. 1.28 కోట్లు.. ఇప్పుడు 1.30 కోట్లు
మండలంలో రహదారులు లేని గ్రామాలెన్నో ఉన్నా బాగున్న రహదారికి నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం నిర్మించినది, ప్రస్తుతం బాగున్న బీటీ రోడ్డుకు మళ్లీ ప్రతిపాదనలు పంపడం, నిధులు కేటాయించడం.. రోడ్డేయడం అన్ని జరిగిపోయాయి. ఐదేళ్ల క్రితం రూ. 1.28 కోట్లతో కరివేన నుంచి నల్లకాల్వ వరకు బీటీ రోడ్డు నిర్మించారు. కష్ణా పుష్కరాల సందర్భంగా ఇదే రహదారికి రూ. 1.30 కోట్లు కేటాయించారు. నిబంధనల మేరకు పాత బీటీ రోడ్డు కూడా తొలగించలేదు. అదే రహదారిపై తారు రోడ్డు వేశారు. నిధులు కాజేయాలనో.. పనులు తర్వగా పూర్తి చేయాలనే తెలియదు కానీ.. వర్షం పడుతున్నా పనులు అలాగే చేసూకుంటూ వెళ్లారు. కరివేన గ్రామంలో సర్పంచ్ పనులు అడ్డుకోవడంతో కొంత పనులు నిలిచిపోయాయి. దాదాపు 4 కి.మీ దూరం ఉన్న బీటీ రోడ్డుపై దాదాపు 3 కి.మీ వరకు రోడ్డేసి నిధులు కాజేశారు.
నాణ్యతలో తేడా లేదు: రమణ, పీఆర్ ఏఈ
పుష్కర నిధులతో చేపట్టిన రహదారు పనులను నాణ్యతతో నిర్మిస్తున్నాం. ప్రతి రోజూ పనులను స్వయంగా పరిశీలిస్తున్నాం. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో అక్కడక్కడ దెబ్బతినడంతో ప్యాచింగ్ వేస్తున్నాం.