విద్యుత్ సంస్థలో వసూల్‌రాజాలు
కడప అగ్రికల్చర్:
విద్యుత్ సంస్థలో వినియోగదారులకు సేవలు అందించేందుకు కాల్ సెంటర్లు ఉంటున్నాయి. వీటిల్లో కొన్ని సెంటర్లు అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. సేవలు పొందవచ్చని ఆశతో వెళ్లే వినియోగదారులను కాల్ సెంటర్ల నిర్వాహకులు దోచుకుంటున్నారు. కాల్ సెంటర్లలో జరిగే విషయాలను ఆలోచిస్తే ఇది చిల్లర వ్యవహారం అనిపించినా అది పెద్ద మొత్తంగా ఉంటోంది. జిల్లాలో వినియోగదారులకు సేవలు అందించడానికి ప్రతి ఏడీఈ పరిధిలో ఒక కాల్‌సెంటర్ ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 18 కాల్ సెంటర్లు ఉన్నాయి.
ఇవి ఏమేం సేవ చేస్తాయంటే..
ఈ కాల్‌సెంటర్లు విద్యుత్‌తో పని ఉండే ప్రతి ఒక్కరికి సేవలు అందించాలి. కొత్త సర్వీసు కావాలన్నా, మీటర్లు మార్చుకోవాలన్నా, విద్యుత్ సర్వీసు కావాలన్నా, ఇతర విద్యుత్ సమస్యలను పరిష్కరించాలన్నా ఈ కాల్‌సెంటర్లు పరిష్కరించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం, వారి సమస్యలను నిర్ణయించిన సమయంలోపు పరిష్కరించడం తదితర పనులు చేయడం ఈ కాల్‌సెంటర్ల విధి. కాగా నిర్వాహకులు ఆయా సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్లను ఆశ్రయించే వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తులు ఇచ్చి ఆయా దరఖాస్తులకు, ఆయా పనులకు కేటాయించిన ఫీజును చెల్లించే సమయంలో తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు.
ఎలాగంటే..
ఒక వినియోగదారుడు ఒక సర్వీసు కోసం దరఖాస్తుతో పాటు నిర్ణీత ఫీజు రూ. 200 చెల్లించాల్సి ఉంది. అయితే ఆ వినియోగదారుడు రూ. 500 నోటు ఇచ్చి మిగతా చిల్లర ఇమ్మని అడిగితే, కొందరు కాల్ సెంటర్ల నిర్వహకులు రూ. 200 తీసుకుంటూ అదే సందర్భంలో ‘అయ్యా...! మిగిలిన చిల్లర రాదు, ఎందుకంటే ఖర్చులు ఉంటాయి, పై అధికారులకు ఇవ్వాలి, మీ పని తొందరగా కావాలంటే ఈ మొత్తం మరచిపోవాల్సిం§ó’lనని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఇలాంటి తతంగం జిల్లాలోని ఒంటిమిట్ట, రాంజపేట, ప్రొద్దుటూరు, రాయచోటి పట్టణాల్లోని కాల్‌సెంటర్లలో అధికంగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. సర్వీసును బట్టి రూ. 100 నుంచి 1000ల వరకు లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాల్‌సెంటర్లలలోని కాంట్రాక్టు కార్మికులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు, ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు. ఇది ప్రతి రోజూ జరుగుతున్న వ్యవహారమేనని విద్యుత్ సంస్థలోని ఓ అ«ధికారి ఆధారాలతో సహా ‘సాక్షి’కి అందించారు. బద్వేలు నియోజకవర్గంలోని ఓ సెంటర్‌లో ఓ రెగ్యులర్ ఉద్యోగి ప్రతి సర్వీసుకు రూ. 100 నుంచి రూ. 500లు ఇవ్వనిదే పని చేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇంటి సర్వీసు కోసం దరఖాస్తు చేసుకున్న బద్వేలు నియోజక వర్గానికి చెందిన రామసుబ్బయ్య అనే వ్యక్తి నుంచి రూ.1000లు తీసుకుని మిగతా చిల్లర అడిగిౖతే పై విధంగా సమాధానం చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో ఓ అధికారికి బాగస్వామ్యం కూడా ఉంటోందని తెలిపారు. మెజార్టీ కాల్‌సెంటర్ల నుంచి నెలనెలా మామూళ్ల రూపంలో ఉన్నతాధికారులకు రూ. లక్షల్లోనే అందుతోందని ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం....
కాల్ సెంటర్లలో అక్రమాలు, చిల్లర వ్యవహారాలు నా దృష్టికి రాలేదు. గతంలో ఇలాంటి సమస్యలు దృష్టికి వచ్చినప్పుడు నిర్వహకులను తొలగించాం. ఇప్పుడు కూడా ఎవరైనా సరే వినియోగదారులు ఇలా ఫలానా కాల్ సెంటర్‌లో డబ్బులు అదనంగా తీసుకుంటున్నారని పిర్యాదు చేస్తే తప్పకుండా ఉద్యోగులపైన చర్యలు తీసుకుంటాం.
–ఎన్‌విఎస్ సుబ్బరాజు, ఎస్‌ఈ, జిల్లా విద్యుత్‌శాఖ.