ముంచెత్తిన వాన
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలోనిచిత్తూరు, నెల్లూరు జిల్లాల ను భారీనుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. వైఎస్సార్, అనంతపురం తదితర జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో సోమవారం 26 సెం.మీ గరిష్ట వర్షపాతం నమోదయ్యింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో రాయలసీమలో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుమలలో జలాశయాలు నిండిపోయాయి. భారీ వ ర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో చీకటిపల్లె - పల్లవోలు గ్రామాల మధ్య ప్రవహిస్తున్న బాహుదా ఏటిలో సోమవారం రాత్రి పాల వ్యాన్(బొలెరో) కొట్టుకుపోయింది.
అమిలేపల్లికి చెందిన వాహన యజమాని శేఖర్(25) గల్లంతయ్యాడు. అదే వాహనంలో ఉన్న ఇద్దరిని పోలీసులు కాపాడారు. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం వెదురుపట్టు పొలా ల్లో ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన 60 మంది కూలీలు వరదనీటిలో చిక్కుకున్నారు. వీరిని స్థానికులు, అధికారులు కలిసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సోమవారం రాత్రి సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఓ కళాశాల బస్సు నీటిలో చిక్కుకుంది. విద్యార్థులను స్థానికులు రక్షించారు. వైఎస్సార్ జిల్లాలో గుంజన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజంపేట నియోజకవర్గం టి.సుండుపల్లె సమీపంలోని మద్దిలవంక వంతెన దాటుతూ కొట్టుకుపోవడంతో మనెమ్మ (35) మృతి చెందింది. సుండుపల్లె వద్ద లగిశెట్టి పిచ్చయ్య (55) బహుదానదిలో కొట్టుకుపోయి మృతి చెందాడు.
పలు రైళ్ల రద్దు..: పలుచోట్ల రైల్వే ట్రాక్‌లపై వరద చేరడంతో విజయవాడ-గూడూరు-చెన్నై మార్గాల్లో నడిచే కొన్ని రైళ్లను రద్దుచేసి, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
చెరువులు జాగ్రత్త: సీఎం
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువుల కట్టలు తెగకుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా తెగినట్లయితే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆరు జిల్లాల కలెక్టర్లతో భారీ వర్షాల ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
తమిళనాడులో 12 మంది మృతి..
తీవ్ర అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ఒక్క చెన్నై నగరంలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. మిగిలిన ప్రాంతాల్లో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని అశోక్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద ముంపులో చిక్కుకున్న 12 మంది పిల్లలు సహా 22 మంది భారత వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.