కరువు తీరే.. రైతు మురిసె
-
ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
హుస్నాబాద్ : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్నాబాద్ ప్రాంతంలోని జలవనరులన్నీ నిండుకుండలయ్యాయి. జిల్లాలో అత్యధిక వర్షపాతం ఇక్కడే నమోదుకావడంతో తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. కాకతీయులు నిర్మించిన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు జలకళ సంతరించుకుంది. 1983లో కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్టతెగింది. ఆతర్వాత కరువు కరువు కాటకాలు ఇక్కడి రైతాంగాన్ని కంటతడిపెట్టించాయి. చెరువులో చుక్కనీరు లేక ఎవుసం బీడుపడింది. 2009, 2013లో కురిసిన వర్షాలకు చెరువు మత్తడి పడింది. అప్పుడు కాస్త ఊరట లభించింది. 16 ఫీట్ల నీటినిల్వ సామర్థ్యం ఉన్న ఎల్లమ్మ చెరువు ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు 14 ఫీట్ల మేర నిండింది. ఈ చెరువు ఆయకట్టు సుమారు రెండు వేల ఎరాల వరకు ఉంది. వరుణుడి కరుణతో ఇప్పుడు ఆయకట్టు అంతా సాగయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చెరువు నిండుకుండలా ఉండడంతో మరో రెండేళ్ల కాలానికి ఢోకాలేదని ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూగర్భజలాలు పెరిగి తాగునీటి ఇబ్బందులు దూరంకానున్నాయి. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో అన్ని చెరువుల్లో పూడిక తీత చేపట్టిన అధికారులు.. ఎల్లమ్మ చెరువులోని పూడిక తీయకపోవడం విశేషం. కాకతీయులు నిర్మించిన ఎల్లమ్మ చెరువును మరింత అభివృద్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ. 6.5 కోట్లు మంజూరు చేసింది. నిధులు వచ్చి ఆరునెలలైనా నేటికీ పనులు ప్రారంభం కాలేదు.