
ములుగులో నిర్మాణంలోఉన్న కళాశాల నూతన భవనం
- నిధులు మంజూరు.. త్వరలో అందుబాటులోకి భవనం
- హర్షం వ్యక్తంచేస్తున్న విద్యార్థులు
ములుగు: సుదీర్ఘ కాలం నుంచి రేకుల షెడ్డులకే పరిమితమైన ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇక సొంత భవనం సమకూరనుంది. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.75 లక్షలు మంజూరు చేసింది. 2001లో ములుగు ఉన్నత పాఠశాలలో షిఫ్ట్ పద్ధతిన కళాశాలను ఏర్పాటుచేశారు.
అనంతరం రెవెన్యూ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా నిర్మించిన రేకుల షెడ్డుల్లోకి మార్చారు. ప్రస్తుతం కళాశాలలో ఇంటర్ మొదటి, ద్వితీయ సీఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు కలుపుకుని మొత్తం 170 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
అయితే అరకొర వసతుల మధ్య చదువులు కొనసాగక విద్యార్థులు నానా ఇబ్బందులుపడుతున్నారు. వీరి ఇబ్బందిని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. భవనం తర్వలో అందుబాటులోకి రానుంది. భవన నిర్మాణంతోపాటు కళాశాల ప్రహరీ, సీసీ రోడ్డు నిర్మాణాలకు మరో రూ.17 లక్షలు మంజూరయ్యాయి.
వసతులు మెరుగుపడుతాయి
కళాశాల నూతన భవనంతో విద్యార్థులకు వసతులు మెరుగుపడతాయి. ఇన్నాళ్లు గదుల కొరతతో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భవిష్యత్‌లో కళాశాలలో మరిన్ని వసతులు సమకూరుస్తాం. - వెంకటాచారి, కళాశాల ప్రిన్సిపాల్
రేకుల షెడ్డులతో తప్పని ఇబ్బందులు
ఇరుకైన రేకుల షెడ్డులతో ఇబ్బందులు పడుతున్నాం. దీనికితోడు ఎండకు ఉక్కపోత, విషపురుగుల సంచారంతో భయంగా ఉంది. చదువుపై దృష్టిపెట్టలేకపోతున్నాం. కళాశాల నూతన భవనం నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. - రాజు, విద్యార్థి
రెండు నెలల్లో పనులు పూర్తిచేస్తాం
కళాశాల భవన నిర్మాణ పనులు మరో రెండు నెలల్లో పూర్తిచేస్తాం. కాంట్రాక్టర్‌కు ఇప్పటి వరకు పూర్తిచేసిన పనులకు సంబందించిన బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. పనులు త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందకు చర్యలు తీసుకున్నాం. - రామచంద్రం, ఈడబ్ల్యుఐడీసీ ఏఈ