బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం
ఈనెల 20న కౌంటింగ్
- 13 ఉపాద్యాయ పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పోలింగ్
– పట్టభద్రు ఓటింగ్ 62.73 శాతమే..
– అనంతపురం చేరిన బ్యాలెట్ బాక్స్‌లు
– గెలుపుపై ఎవరి అంచనాలు వారివే..
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపై పడింది. గెలుపుపై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఓట్ల లెక్కింపునకు మరో 10 రోజుల గడువు ఉండటంతో విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పట్టభద్రల నియోజకవర్గానికి సంబంధించి వెన్నపూస గోపాల్‌రెడ్డి, గేయానంద్ మధ్యనే పోటీ ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయులకు 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఏకంగా 13 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పోలింగ్ నమోదయింది. అతి తక్కువగా కర్నూలు డివిజన్‌లోని 147వ పోలింగ్ కేంద్రంలో 69.57 శాతం పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ కేంద్రంలో 23 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 16 మంది ఓటేశారు.
శాసనమండలి ఎన్నికలను పట్టించుకోని పట్టభద్రులు
జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 82,591 మంది ఉన్నారు. వీరికి 121 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పట్టభద్రులు ఎన్నికలపై ఆసక్తి చూపలేదు. కేవలం 51,813 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 62.73 శాతం మాత్రమే ఉంది. ఆదోని డివిజన్‌లో అత్యధికంగా 70.98 శాతం పోలింగ్ జరిగింది. కర్నూలు డివిజన్‌లో అత్యధికంగా 267 పోలింగ్ కేంద్రంలో 73.63 శాతం పోలింగ్ సమోదయింది. నంద్యాల డివిజన్‌లోని 334వ పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 69.07 శాతం పోలింగ్ జరిగింది. అతి తక్కువగా నంద్యాల డివిజన్‌లోని 316ఏ పోలింగ్ కేంద్రంలో 45.73 శాతం పోలింగ్ నమోదయింది.
రెవెన్యూ డివిజన్ వారీగా ఉపాద్యాయ ఓటర్ల పోలింగ్
–––––––––––––––––––––––––––––––––
డివిజన్ మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు శాతం
–––––––––––––––––––––––––––––––––
ఆదోని 1523 1428 93.76
కర్నూలు 3102 2870 92.52
నంద్యాల 2045 1917 93.74
––––––––––––––––––––––––––––––––––
మొత్తం 6670 6216 93.17
––––––––––––––––––––––––––––––––––
రెవెన్యూ డివిజన్ వారీగా పట్టభద్రుల ఓటర్ల పోలింగ్
––––––––––––––––––––––––––––––––––
డివిజన్ మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు శాతం
––––––––––––––––––––––––––––––––––
ఆదోని 14968 10625 70.98
కర్నూలు 41723 25515 61.15
నంద్యాల 25900 15673 60.51
––––––––––––––––––––––––––––––––––
మొత్తం 82591 51813 62.73
–––––––––––––––––––––––––––––––––-
అనంతపురం చేరిన బ్యాలెట్ బాక్స్‌లు
పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లను అనంతపురానికి తరలించారు. కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్ కేంద్రాలలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్‌లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రత్యేక పోలీసు బందోబస్తుతో తరలించారు. ఈ నెల 20న అనంతపురంలో ఓట్ల లెక్కింపు చేపడతారు.