భవిష్యత్ వైఎస్‌ఆర్‌సీపీదే
– 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం
– ఘనంగా వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం
– జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): భవిష్యత్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని, 2019లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కర్నూలు ఎంపీ బుట్టారేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మురళీకృష్ణ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాంపుల్లయ్య యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజవిష్ణువర్దన్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమణ తదితరులు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం కేకును కట్ చేసి కార్యకర్తలక పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందని, సీఎం చంద్రబాబునాయుడు..వైఎస్‌ఆర్‌సీపీని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. త్వరలో జరగబోయే కర్నూలు మునిసిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక, వచ్చే ఏడాది జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ కార్యకర్తలు, నాయకులు దృష్టిసారించాలన్నారు. గెలుపుకోసం ప్రణాళికలు రచించి ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నరసింహులు యాదవ్, సురేందర్ రెడ్డి, రమణ, జహీర్ అహ్మద్‌ఖాన్, గోపీనాథ్‌యాదవ్ పర్ల శ్రీధర్, కర్నాటి పుల్లారెడ్డి, బెల్లం మహేశ్వరరెడ్డి, రెహ్మన్, మద్దయ్య, మంగమ్మ, సలోమి, విజయలక్ష్మీ, కటారి సురేష్ తదితరు పాల్గొన్నారు.
హోలీ వేడుక
వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అనంతరం నాయకులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. తమ పార్టీ భవిష్యత్ రంగ కేళిగా ఉంటుందని ఎంపీ బుట్టారేణుక పేర్కొన్నారు.