మాట్లాడుతున్న జేఏసీ నాయకులు
గద్వాల న్యూటౌన్ : రాజకీయ పార్టీల నాయకులు అన్ని జెండాలు, అజెండాలు పక్కన బెట్టి గద్వాల జిల్లానే ఏకైక అజెండాగా కలిసి ఉద్యమించాలని జేఏసీ నాయకులు వీరభద్రప్ప, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, రాజవర్ధన్‌రెడ్డి కోరారు. శనివారం స్థానిక టీఎన్‌జీఓ భవనంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయవచ్చని ప్రభుత్వమే చెప్పిందని, అయితే ఇక్కడి ప్రాంత ప్రజలు ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అవహేళన చేసేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం దారుణమన్నారు. పార్టీలకతీతంగా కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు కలిసి పోరాటం చేస్తుంటే రాజకీయ పోరాటమని కొట్టి పారేయడం తగదన్నారు. గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆదివారం జూరాల ప్రాజెక్టుపై నల్లబ్యాడ్జీలతో మన జిల్లా–మన ప్రాజెక్టు పేరుతో చేపట్టే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. దీనికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నాయకులు సుభాన్, గడ్డం కష్ణారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మున్నాభాషా మద్దతునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బీజాపూర్ ఆనంద్, బాలగోపాల్‌రెడ్డి, మోహన్‌రావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.