
గజ్వేల్ పట్టణ ప్రధాన రహదారి
- రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో అభివృద్ధి శరవేగం
- అందుబాటులో డివిజన్ స్థాయి కార్యాలయాలు
- ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి సన్నాహాలు
- రాష్ట్రంలోనే ఇది తొలి కార్యాలయం
గజ్వేల్: గజ్వేల్ రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి. అభివృద్ధి మరింత వేగం అందుకోనుంది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో దశదిశా మారనుంది. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఈ పట్టణం గజ్వేల్‌తోపాటు దౌల్తాబాద్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, వర్గల్, చేర్యాల, మద్దూర్ మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. కొత్తగా ఇందులోకి వరంగల్ జిల్లా చేర్యాల, మద్దూర్ మండలాలు, దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలాన్ని చేర్చారు.
ఇప్పటికే ఇక్కడ రెవెన్యూ డివిజన్ స్థాయి తరహాలో వాటర్‌గ్రిడ్ ఈఈ, ప్రాణహిత పథకం ఈఈ, ఇరిగేషన్ శాఖ ఈఈ కార్యాలయాలున్నాయి. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వ శాఖలన్నింటికీ కలిపి ఇంటిగ్రేటెడ్ కార్యాలయాన్ని పట్టణంలోని హౌసింగ్ బోర్డు మైదానంలో ఏర్పాటు చేస్తున్న విషయం తెల్సిందే. గతేడాది సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ఇక్కడ పర్యటించిన నేపథ్యంలో గజ్వేల్‌కు రెవెన్యూ డివిజన్ హంగులు తెస్తామని ప్రకటించి మాట నిలబెట్టుకున్నారు.
గజ్వేల్ నేపథ్యం
గజ్వేల్ రెవెన్యూ డివిజన్ వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉంది. అందుకే ఇక్కడ ఈ మూడు జిల్లాల సంస్కృతి విస్తరించింది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకొని ఉండటంతో ఇక్కడా నగర వాతావరణం కన్పిస్తోంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గజ్వేల్‌కు చరిత్ర ఉంది. 1969లో జరిగిన కాల్పుల్లో పట్టణానికి చెందిన పన్నెండేళ్ల బాలుడు అయిల నర్సింలు అసువులు బాసాడు.
2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ప్రకటన చేసి వెనక్కి తగ్గిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ ఉద్యమాలు జరిగాయి. కూరగాయల సాగుతో గజ్వేల్ డివిజన్ ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. ములుగులోని అటవీ పరిశోధనా కేంద్రంలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. దీంతోపాటు ఫారేస్ట్రీ కళాశాలను సైతం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
కేసీఆర్ ‘ఇలాకా’గా ఆవిర్భావం
2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్న కేసీఆర్ ఘన విజయాన్ని సాధించారు. ఆ తరువాత ఆయన ఈ ప్రాంతాన్ని తన సొంత ‘ఇలాకా’గా మార్చుకున్నారు. నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులో ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే దిశలో టీఆర్‌ఎస్ చేపట్టిన ఉద్యమాలకు సంబంధించి ఇక్కడి నుంచే వ్యుహా రచన చేశారు.
పర్యాటక ప్రాంతంగా గుర్తింపు
గజ్వేల్ పర్యాటక ప్రదేశంగానూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. వర్గల్‌లోని విద్యాసరస్వతీ ఆలయం తెలంగాణలో బాసర తర్వాత రెండో ఆలయంగా, ఇదే మండలంలోని నాచారంగుట్ట రెండో యాదగిరి గుట్టగా బాసిల్లుతున్నాయి.
రెవెన్యూ డివిజన్ పరిధి ఇలా..
మండలం జనాభా
గజ్వేల్ 77,264
జగదేవ్‌పూర్ 47,093
కొండపాక 48,592
ములుగు 44,076
వర్గల్ 44,525
మద్దూర్ 38,731
చేర్యాల 70,809
దౌల్తాబాద్ 53,824