డిసెంబర్ చివరి నాటీకి గాలేరు-నగరి పూర్తి
Published Mon, Nov 28 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
- గోరుకల్లుపై రెండు రోజుల్లో నిర్ణయం
- సాగునీటి తర్వాత చూద్దామంటూ దాటవేత
- సాగునీటి ప్రాజెక్టులపై సీఈలతో సీఎం సమీక్ష
కర్నూలు సిటీ: రాయల సీమ జిల్లాలకు ప్రధానమైన గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం పనులు వచ్చే నెల చివరి నాటికి కచ్చితంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు జల వనరుల శాఖ సీఈని ఆదేశించారు. సోమవారం విజయవాడలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై సీఎం సమీక్షించారు. రాయలసీమలోని కడప, చిత్తూరు, నెల్లురు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు ఈ ఏడాది కచ్చితంగా కాల్వలో నీరు పారించాలన్నారు. పనుల్లో ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకరావాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లతో మాట్లాడి వేగవంతం చేయాలన్నారు. ఎస్‌ఆర్‌బీసీ విస్తరణ పనులు డిసెంబరు 15 లోగా పూర్తి చేయాలన్నారు. ప్రధాన కాల్వలో కనీసం 5 వేల క్యుసెక్కుల నీరు పారేలా పనులు చేయించాలని సీఎం ఇంజినీర్లకు సూచించారు. గోరుకల్లు పరిస్థితి ఎంటని, ఎందుకు లీకేజీలే అవుతున్నాయని సీఎం ఆరా తీశారు. నివారణ చర్యలు చేపట్టేందుకు లోడెడ్ బర్మ్‌కు రూ. 45 కోట్లతో అంచనాలు వేశామని, దీనిపై రెండు రోజుల్లో ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీఈ, మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. టీబీ డ్యాం నీటి గురించి జిల్లా ఇంజినీర్లు పంపిన నివేదికలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుదని పేర్కంటూ సీఎం దాటవేసినట్లు తెలిసింది. వచ్చే నెల చివరి నాటికి గండికోటకు కచ్చితంగా 5 వేల క్యుసెక్కుల నీరు వెళ్లేలా పనులు చేయించాలన్నారు. అలాగే ఆవుకు సొరంగం పనుల గురించి సీఎం సీఈని అడిగి తెలుసుకున్నారు.
Advertisement
Advertisement