ఆన్‘లైన్’లో పేకాటరాయుళ్లు
ఆన్‘లైన్’లో పేకాటరాయుళ్లు
Published Mon, Jan 9 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM
- స్మార్ట్ ఫోన్‌లో దర్జాగా ఆన్‌లైన్ రమ్మీ
- బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు టేబుల్ ప్రత్యక్షం
- జిల్లాలో రోజుకు రూ. కోట్లలో ఆట
- పేదలు మొదలు అధికారులు, ప్రజాప్రతినిధులు లాగిన్
- తరుచూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆడుతున్న వైనం
- 15 శాతం కమీషన్‌ను వసూలు చేస్తున్న ఆన్‌లైన్ సైట్లు
కర్నూలులోని వీఆర్ కాలనీకి చెందిన రాము ప్రైవేటు ఉద్యోగి. ఓ రోజు తన కంప్యూటర్‌లో నెట్ చూస్తుండగా రమ్మీ యాడ్ కనిపిస్తే క్లిక్ చేశాడు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అడిగితే ఎంటర్ చేశాడు. మొదట తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 100 ట్రాన్స్‌ఫర్ చేశాడు. కొద్దిసేపు ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడగా రూ.500 వచ్చాయి. దీంతో అతనికి నమ్మకం పెరిగింది. ఆడితే లాభాలు వస్తాయని నిత్యం కంప్యూటర్ ముందే ఉండేవాడు. మొదట రూ. 100 ప్రారంభమై రెండు వేల నుంచి 5 వేలకు పెరిగింది. ఇలా పెరుగుతూ పోతూ పోయింది. కానీ తనకు వచ్చింది ఏమి లేదు. సమయం, డబ్బు వృథా చేసుకున్నాడు.
కర్నూలు నగరం గణేష్‌నగర్‌కు చెందిన యువకుడు ఉసేన్ స్నేహితుడి ద్వారా ఆన్‌లైన్ రమ్మీ గురించి తెలుసుకున్నాడు. మొదటల్లో సరదాగా మొదలై చివరకు బానిసయ్యాడు. మొదట రూ, వెయ్యి, రెండు వేలు లాభాలు వస్తే అదృష్టం బాగుందని రేయింబవళ్లు తన స్మార్ట్ ఫోన్‌లో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ నష్టపోయాడు. నెలకు అతని నెట్ బిల్ రూ. 1000 వచ్చేది. నాలుగైదు నెలల్లో రూ.20 వేలు పోగొట్టుకున్నాడు. కుటుంబ సభ్యుల హెచ్చరికలతో మేలుకొని ఇప్పుడు దానిజోళికి వెళ్లడం లేదు.
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): నెట్టింట్లో జూదం ఆరు షోలు.. మూడు డ్రాప్‌లుగా సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పేకాట రాయుళ్లు కూడా అందిపుచ్చుకుంటున్నారు. గతంలో పేకాట ఆడేందుకు కొండలు, గుట్టలు, పొలాల వైపు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎక్కడ కూర్చుంటే అక్కడే దర్జాగా ఆడేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఆన్‌లైన్ రమ్మీ టేబుల్ ప్రత్యక్ష మవుతోంది. జిల్లాలో రోజుకు రూ. కోట్లకు పైగా ఆటలు సాగుతున్నాయి. పేదలు మొదలుకొని మధ్యతరగతి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆటలో నిమగ్నం అవుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. పలు అన్‌లైన్ సైట్లు 15 శాతం కమీషన్‌తో రమ్మీని నిర్వహిస్తున్నాయి. ఽస్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఆన్‌లైన్‌లో రమ్మీని ఆడేవయచ్చు. వందలాది ఆన్‌లైన్ రమ్మీ సైట్ల యాప్‌లు ఉన్నాయి. అందులో ఏదో ఒక్కదాన్ని డౌన్‌లోడ్ చేసుకొని అకౌంట్‌ను ఏర్పాటు చేసుకొని బ్యాంకు అకౌంట్ నుంచి నగదును జమ చేసుకుంటే చాలు ఆన్‌లైన్‌లో టేబుళ్లు సిద్ధంగా ఉంటాయి.
ఐదు పైసల ఆట నుంచి.....
ఆన్‌లైన్‌లో రమ్మీ ఆటకు భలే డిమాండ్ ఉంది. ఐదు పైసల నుంచి కోట్లాది రూపాయల వరకు ఆట జరుగుతుంది. 24 గంటల పాటు వేలాది టేబుళ్లు సిద్ధంగా ఉంటాయి. ఒక్కో టేబుల్ ఆరుగురు రమ్మీదారులు ఉంటారు. ఈ ఆటలో పాల్గొనాలంటే ముందుగా అకౌంట్‌లో ఉండే నగదును చూపించాల్సి ఉంటుంది. ఆ నగదును బట్టి ఆరుగురికి ఒక్కో టేబుల్ మాదిరి రమ్మీ జోరుగా కొనసాగుతోంది. వీరు ఎక్కడికో వెళ్లి ఆట ఆడాల్సిన పనిలేదు. నలుగురితో మాట్లాడుతూనే కానిచ్చేయవచ్చు. ఎక్కువగా టీ పాయింట్లు, ఇళ్లు, కార్యాలయాల్లోనే ఆట సాగుతోంది.
15 శాతం కమీషన్‌ను వసూలు చేస్తున్న వైనం...
ఆన్‌సైట్లన్నీ రమ్మీ నిర్వహణ కోసం గెలుచుకున్న వారి సొమ్మును 15 శాతం కమీషన్‌ను వసూలు చేస్తున్నాయి. ఓ వ్యక్తి వెయ్యి రూపాయలు గెలుచుంటే అతినికి 15 శాతం అంటే 150 రూపాయలు పట్టుకొని 850 రూపాయలను అకౌంట్లలో జమ చేస్తున్నాయి. ఇలా రేయింబవళ్లు జరిగే ఆన్‌లైన్ రమ్మీతో ఆన్‌లైన్ సైట్లకు కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చిపడుతోంది. అయితే దాని నుంచి బాగుపడిన వారు మాత్రం ఎవరూ కనిపించడం లేదు. ఎవరినీ పలుకరించిన పోగుట్టున్నామనే చెబుతుండటంతో అంతా మోసమేనని తెలుస్తోంది.
పేదలే సమిధలు...
ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్న వారిలో ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. వీరంతా పగలంతా కష్టపడి సంపాదించిన సొమ్మును రమ్మీ కోసం తగిలేస్తున్నారు. అంతేకాక చిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు, అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా రమ్మీకి అంకితమయినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆన్‌లైన్ సైట్ల రమ్మీలో నిత్యం కనిపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఏ స్థాయిలో ఆట జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో రోజులో రూ. పది కోట్లకుపైగా ఈ ఆట జరుగుతోందని అంచనా.
కుటుంబాలను నాశనం చేసుకోవద్దు: ఆకే రవికృష్ణ, జిల్లా ఎస్పీ
జూదానికి దూరంగా ఉండకపోతే కుటుంబాలు నాశనం అవుతాయి. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ అయినా జూదం వద్దు. ఆన్‌లైన్ సైట్లపై దృష్టి సారిస్తాం. సాంకేతిక పరిజ్ఞానంలో నూతనంగా వస్తున్న ఆధునికతను మంచికోసం వినియోగించుకోవాలని, చెడుకోసం వద్దు. ఆన్‌లైన్ రమ్మీతో సైట్లకే లాభం. పేదలు మాత్రం సమిధలు కావాల్సిందే.
Advertisement
Advertisement