
బతుకులు ‘క్లోజ్’
- మట్కాతో సామాన్యులు చిత్తు..
- హిందూపురం కేంద్రంగా సాగుతున్న వ్యాపారం
- ప్రతి నెలా రూ.4.50 కోట్లకు పైగా లావాదేవీలు
- బహిరంగంగా మట్కా రాస్తున్నా పట్టించుకోని వైనం
నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మట్కా బహిరంగంగా నిర్వహిస్తున్నా అడ్డుకునేవారు లేరు. అదృష్టం బాగుంటే సునాయసంగా ధనవంతులు కావచ్చన్న అత్యాశతో కొంతమంది ప్రజలు మట్కాకు బానిసవుతున్నారు. సంపాదించిన సొమ్మంతా మట్కాకు తగలేస్తూ ఆర్థికంగా చితికిపోయి బతుకులు ‘క్లోజ్’ చేసుకుంటున్నారు.
హిందూపురం అర్బన్: మట్కా వ్యసనం సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. అటువంటి మట్కా నిర్వహణకు హిందూపురం ప్రాంతం కేరాఫ్‌గా నిలుస్తోంది. లైసెన్స్‌డ్ వ్యాపారం అన్నట్టు నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. షెడ్లల్లో కౌంటర్లు ఏర్పాటు చేసుకుని మట్కా చీటీలు రాస్తున్నారు. ప్రతి రోజూ రూ.కోట్లల్లో లావాదేవీలు కొనసాగిస్తున్నారు. పట్టణంలో ప్రధానంగా మూడు కంపెనీలు వాల్మీకి సర్కిల్, మార్కెట్‌యార్డు సర్కిల్, కొట్నూరు ప్రాంతాల్లో వారానికి నాలుగు రోజులు చొప్పున మట్కా నిర్వహిస్తున్నారు. వారానికి నాలుగు రోజులు చొప్పున ఒక్కో కంపెనీ నెలకు రూ.1.50 కోటి వరకు లావాదేవీలు నిర్వహిస్తోంది. అంటే మూడు కంపెనీలూ కలిసి నెలకు రూ.4.50 కోట్లు మట్కా వ్యాపారం చేస్తోంది.
కర్ణాటక నుంచి టర్న్..
కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి హిందూపురంలోని కంపెనీలకు నంబర్లు టర్న్ (అక్కడ ఎక్కువైన వ్యాపార లావాదేవీలు ఈ ప్రాంతానికి మళ్లించే ప్రక్రియ) చెబుతారు. వాటి కలెక‌్షన్ ప్రతి శుక్రవారం నిర్వాహకులకు చేరుతుంది. ప్రతి నెలా ఈ కలెక‌్షన్ రూ.1.50కోట్ల వరకు కంపెనీలకు వస్తున్నట్లు తెలిసింది. కర్ణాటకలో మట్కా నిర్వాహకులపై అక్కడి పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అక్కడివారు సరిహద్దు ప్రాంతమైన హిందూపురం కంపెనీలతో పొత్తుపెట్టుకుని టర్న్ అందిస్తున్నట్లు సమాచారం.
మట్కా నిర్వాహణ మూడురకాలు..
1) మిలాన్ డే మట్కా : దీనికి ఉదయం నుంచే మట్కా పట్టీలు రాస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ బ్రాకెట్‌గా మొదటి అంకె వస్తుంది. సాయంత్రం 5.10 గంటలకు రెండవ అంకె క్లోజ్ బ్రాకెట్ ప్రకటిస్తారు. రెండు అంకెలు సరిపోతే రూ.1కి రూ.80 ప్రకారం నిర్వాహకుడు చెల్లిస్తాడు. ఇందులోనే 0 నుంచి 9 అంకెలల్లో ఒకటి మాత్రమే ఓపెన్ అడితే రూ.1కి రూ.8 చెల్లిస్తారు.
2) మిలాన్ నైట్ : ఓపెన్ బ్రాకెట్ రాత్రి 9గంటలకు, క్లోజ్ బ్రాకెట్ రాత్రి 11.30గంటలకు ప్రకటిస్తారు. దీనికి కూడా రూ.1కి రూ.80ప్రకారం చెల్లిస్తారు.
3) బాంబే మట్కా : ఓపెన్ బ్రాకేట్ రాత్రి 9.50 గంటలకు వస్తుంది. క్లోజ్ బ్రాకెట్ అర్థరాత్రి 12.15గంటలకు ప్రకటిస్తారు. ఈ మట్కాకు కూడా రూ.1కి రూ.70 నుంచి రూ.80 ప్రకారం చెల్లిస్తారు. కంపెనీ నిర్వాహకులుగా పట్టణంలో ఐదుగురు కొనసాగుతుండగా.. అనుచరులుగా మట్కా బీటర్లు దాదాపు వందకుపైగా ఉన్నారు. బీటరు పట్టీలు రాసినందుకు రూ.వందకు రూ.20 ప్రకారం కమీషన్ చెల్లిస్తారు.
మట్కా రాసే కేంద్రాలివే..
పట్టణంలోని మేళాపురం, ముద్దిరెడ్డిపల్లి, ధన్‌రోడ్డు, హస్నాబాద్, పరిగిరోడ్డు, నింకంపల్లి, ఆబాద్‌పేట, పరిగి బస్టాండు, చిన్నమార్కెట్, బెంగళూర్‌రోడ్డు, వాల్మీకిసర్కిల్, సూరప్పకుంట, రహమత్‌పురం, రైల్వేస్టేషన్ ఏరియా, శ్రీకంఠఫురం, త్యాగరాజనగర్‌లతోపాటు రూరల్‌పరిధిలోని తూమకుంట, మణేసముద్రం, గోళాపురం సరిహద్దులో ,దేవరపల్లి, మలుగూరు గ్రామాల్లో విచ్చలవిడిగా మట్కా సాగుతోంది.
- అలాగే లేపాక్షిమండల కేంద్రంతోపాటు కంచిసముద్రం, చోళసముద్రం, కొండూరు, చిలమత్తూరు మండలంలోని కొడూరు, కొడికొండ, చెక్‌పోస్టు, పాలేపల్లి గ్రామాల్లో ప్రతిరోజూ రూ.లక్షల్లో మట్కా వ్యాపారం జరుగుతోంది.
మరో 15రోజుల్లో కట్టడి చేస్తాం
హిందూపురం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి మట్కా, జూద కేంద్రాలు లేకుండా కట్టడి చేయిస్తాం. ఇప్పటికే వీటిపై దృష్టి పెట్టాం. ఇంకా నిశితంగా పరిశీలింపజేసి చర్యలు తీసుకుంటాం.
- కరీముల్లా షరీఫ్, డీఎస్పీ, పెనుకొండ