పాఠశాలస్థాయిలో క్రీడా ప్రణాళిక
పాఠశాలస్థాయిలో క్రీడా ప్రణాళిక
Published Thu, Aug 18 2016 8:53 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు పలు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పాఠశాలస్థాయిలో క్రీడా ప్రణాళిక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ప్రగతి తీరుపై ఆయన సమీక్షించారు. పిల్లల్లో విద్యతో పాటు క్రీడానైపుణ్యం పెంపొందించినప్పుడే మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉంటారని, అందుకే పది రకాల క్రీడాంశాల్లో విద్యార్థులు మంచి ప్రావీణ్యం సంపాదించే విధంగా ప్రతి రోజూ సాయంత్రం సమయంలో ప్రత్యేక క్రీడలు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. చిన్నప్పటి నుంచే క్రీడల్లో మంచి శిక్షణ పొందినప్పుడే జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాపోటీల్లో మంచి ఫలితాలు లభిస్తాయని కలెక్టర్ చెప్పారు.
ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ క్రీడల్లో శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమాజంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వారిలో 99 శాతం విద్యార్థులు పేదవారేనని, హమాలీ కూడా తన పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటే ప్రజల ఆలోచనా ధోరణి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పదోతరగతి పాసైన వారు, ఫెయిలైన వారు కూడా ఉపాధ్యాయులుగా ఉంటున్నారని, అదే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి అపార అనుభవం గల టీచర్లు ఉన్నారన్నారు. పాఠశాలస్థాయి నుంచే వృత్తి విద్యాకోర్సుల్లోనూ మంచి శిక్షణ అందించి భవిష్యత్‌లో విద్యార్థులు జీవితంలో స్థిరపడే విధంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. సమావేశంలో డీఈవో మధుసూదనరావు, సర్వశిక్షాభియాన్ పీవో బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
Advertisement