మరోసారి.. గాంధీ హత్య | Gandhiji statue thrown into budameru canal in vijayawada | Sakshi
Sakshi News home page

మరోసారి.. గాంధీ 'హత్య'

Published Sat, Aug 6 2016 3:23 AM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

మరోసారి.. గాంధీ హత్య - Sakshi

మరోసారి.. గాంధీ హత్య

ఇబ్రహీంపట్నంలో అర్ధరాత్రి గాంధీ విగ్రహం తొలగింపు
* కనీస జాగ్రత్త చర్యలు తీసుకోని అధికారులు
* కాళ్లూ చేతులు విరిగిపోయిన వైనం
* గుట్టుచప్పుడు కాకుండా బుడమేరులో పడేసిన సిబ్బంది
* రాష్ట్ర ప్రభుత్వ తీరుపై స్థానికుల  ఆగ్రహం..


సాక్షి ప్రతినిధి, అమరావతి / ఇబ్రహీంపట్నం: జాతిపితకు ఘోర అవమానం జరిగింది. యావత్తు దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా.. రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా మహాత్మాగాంధీ విగ్రహాన్ని పెకిలించి పారేసింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడికి కనీస గౌరవమైనా ఇవ్వకుండా ఏట్లో పడేసింది.

తెల్లవారే కాలువలో మహాత్ముడి విగ్రహాన్ని చూసిన స్థానికుల్లో ఆగ్రహం మిన్నంటింది. కాళ్లూ చేతులూ విరిగిపోయిన దుస్థితిలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీసుకువచ్చి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దేవుళ్లు, మహనీయుల విగ్రహాలను తొలగిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. చివరకు సుమారు ఏడు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన గాంధీ విగ్రహాన్ని కూడా తొలగించివేసింది. విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నం రింగ్‌రోడ్డు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి పొక్లెయిన్‌తో వచ్చిన ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది.. పోలీసు బందోబస్తు మధ్య గాంధీజీ విగ్రహాన్ని పెకిలించారు.నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విగ్రహం కాళ్లు, చేతులు విరిగిపోయాయి. దీంతో విగ్రహాన్ని ఎవరికీ కన్పించకుండా చేయాలని భావించిన అధికారులు దాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న బుడమేరులో పడేశారు. తెల్లవారిన తర్వాత విగ్రహం కన్పించకపోవడంతో స్థానికులు ఆరా తీశారు. వారికి రెవెన్యూ అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.కాసేపటికి బుడమేరులో పడి ఉన్న గాంధీజీ విగ్రహాన్ని కొందరు గమనించడంతో బయటకు పొక్కింది. స్థానికులు పెద్దయెత్తున గుమిగూడి విగ్రహాన్ని బయటకు తెచ్చారు.

విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు.  విగ్రహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించడానికి అధికారులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. విగ్రహ పునఃప్రతిష్టకు సబ్ కలెక్టర్ ఫోన్ ద్వారా ఇచ్చిన హామీతో నిరసనకారులు మధ్యాహ్న సమయంలో తమ ఆందోళన విరమించారు.
 
ఏడు దశాబ్దాల చరిత్ర : ఇబ్రహీంపట్నం జాతీయ రహదారి నుంచి ఫెర్రీ స్నాన ఘట్టానికి వెళ్లే రోడ్డు ప్రారంభంలో త్రిభుజాకృతిలో ఏర్పాటు చేసిన గద్దెపై 1948లో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి గాంధీబొమ్మ సెంటర్ అనే పేరు వచ్చింది.విగ్రహం పాతబడి పోవడంతో తమ స్థలంలో గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్టించడానికి నేషనల్ హైవే అథారిటీ రోడ్డు పక్కన స్థలంతో పాటు విగ్రహాన్ని ఇచ్చింది. దీంతో 1999లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.  
 
పునఃప్రతిష్టించాల్సిందే..: ఈ విగ్రహం తొలగింపుపై స్థానికులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశాలతోనే అధికారులు  తెగబడ్డారని ఆరోపిస్తున్నారు.  విగ్రహాన్ని అదే స్థలంలో తక్షణం పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement