రాష్ట్రమంతటా గ్రేటర్ కోనేర్ల ఫార్ములా
రాయదుర్గం: గణనాథుల నిమజ్జనం కోసం గ్రేటర్‌లో ఏర్పాటు చేస్తున్న కోనేర్ల నిర్మాణ ఫార్ములాను రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. వినాయక ప్రతిమల నిమజ్జనం కోసం నగరంలో 10 కోనేర్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో రాయదుర్గం మల్కం చెరువు వద్ద పూర్తయిన మొదటి కోనేరును శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు సాయిబాబా, హమీద్‌పటేల్‌లతో కలిసి మేయర్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులు... ప్రజలతో కలిసి నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మేయర్ విలేకర్లతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశం, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో ఈ కోనేర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. వీటిని ప్రజలు అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం గ్రేటర్‌లో 10 కోనేర్ల నిర్మాణం చేపట్టామని, వచ్చే ఏడాది మరో 30–40 చెరువుల వద్ద నిమజ్జన కోనేర్లు నిర్మిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, చెరువులు కలుషితం కాకుండా చూడాలనే ఉద్దేశంతో కేరళ, బెంగళూర్‌లలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం అనుసరిస్తున్న ఫార్ములాను నగరంలో అమలు చేస్తున్నామన్నారు. ఈ కోనేర్లలో 7–8 ఫీట్ల గణనాథులను నిమజ్జనం చేయడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. పర్యావరణ స్పృహతో చాలాచోట్ల మట్టి గణపతులనే ప్రతిష్టించారని, భవిష్యత్తులో మొత్తం మట్టి గణనాథులనే వినియోగించేలా కృషి చేస్తామన్నారు.
రూ. 6.95 కోట్ల వ్యయంతో..
జీహెచ్‌ఎంసీ ఇరిగేషన్ ఎస్‌ఈ వై.శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రూ.6.95 కోట్ల వ్యయంతో ఈ కోనేర్ల నిర్మాణం చేపట్టామన్నారు. కోనేర్లు 43(ఇంట్)43 చదరపు మీటర్ల పొడవు, వెడల్పు.. 4 మీటర్ల లోతుతో నిర్మించామని చెప్పారు. కోనేరులో రెండు వేల విగ్రహాలు నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతి కోనేరులో స్వచ్ఛమైన నీటినే వాడాలని ఆదేశించడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి కోనేర్లలో నింపుతున్నామన్నారు.
ఎప్పటికప్పుడు విగ్రహాలు తొలగించి, నీటిని పంపింగ్ ద్వారా డ్రైనేజీలోకి వదిలి కోనేరులో శుభ్రమైన నీటిని నింపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ వెస్ట్ జోన్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్, ఈఈ మోహ¯ŒSరెడ్డి, డీఈ కిష్టప్ప, ఏఈ కనకయ్య, శానిటరీ సూపర్‌వైజర్ జలంధర్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.