Ganesha immersion
-
వర్షంలోనూ ఉత్సాహంగా..
సాక్షి, సిటీబ్యూరో :నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణేశ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శనివారం కూడా కొనసాగింది. హుస్సేన్ సాగర్‌తో పాటు నెక్లెస్ రోడ్డు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో నిమజ్జనం చేశారు. ప్రధాన చెరువుల్లోనూ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. -
రాష్ట్రమంతటా గ్రేటర్ కోనేర్ల ఫార్ములా
రాయదుర్గం: గణనాథుల నిమజ్జనం కోసం గ్రేటర్లో ఏర్పాటు చేస్తున్న కోనేర్ల నిర్మాణ ఫార్ములాను రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. వినాయక ప్రతిమల నిమజ్జనం కోసం నగరంలో 10 కోనేర్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో రాయదుర్గం మల్కం చెరువు వద్ద పూర్తయిన మొదటి కోనేరును శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు సాయిబాబా, హమీద్పటేల్లతో కలిసి మేయర్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులు... ప్రజలతో కలిసి నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మేయర్ విలేకర్లతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశం, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో ఈ కోనేర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. వీటిని ప్రజలు అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గ్రేటర్లో 10 కోనేర్ల నిర్మాణం చేపట్టామని, వచ్చే ఏడాది మరో 30–40 చెరువుల వద్ద నిమజ్జన కోనేర్లు నిర్మిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, చెరువులు కలుషితం కాకుండా చూడాలనే ఉద్దేశంతో కేరళ, బెంగళూర్లలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం అనుసరిస్తున్న ఫార్ములాను నగరంలో అమలు చేస్తున్నామన్నారు. ఈ కోనేర్లలో 7–8 ఫీట్ల గణనాథులను నిమజ్జనం చేయడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. పర్యావరణ స్పృహతో చాలాచోట్ల మట్టి గణపతులనే ప్రతిష్టించారని, భవిష్యత్తులో మొత్తం మట్టి గణనాథులనే వినియోగించేలా కృషి చేస్తామన్నారు. రూ. 6.95 కోట్ల వ్యయంతో.. జీహెచ్ఎంసీ ఇరిగేషన్ ఎస్ఈ వై.శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రూ.6.95 కోట్ల వ్యయంతో ఈ కోనేర్ల నిర్మాణం చేపట్టామన్నారు. కోనేర్లు 43(ఇంట్)43 చదరపు మీటర్ల పొడవు, వెడల్పు.. 4 మీటర్ల లోతుతో నిర్మించామని చెప్పారు. కోనేరులో రెండు వేల విగ్రహాలు నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతి కోనేరులో స్వచ్ఛమైన నీటినే వాడాలని ఆదేశించడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి కోనేర్లలో నింపుతున్నామన్నారు. ఎప్పటికప్పుడు విగ్రహాలు తొలగించి, నీటిని పంపింగ్ ద్వారా డ్రైనేజీలోకి వదిలి కోనేరులో శుభ్రమైన నీటిని నింపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్, ఈఈ మోహ¯ŒSరెడ్డి, డీఈ కిష్టప్ప, ఏఈ కనకయ్య, శానిటరీ సూపర్వైజర్ జలంధర్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
తలపాగా విప్పి నలుగురిని కాపాడాడు...
సంగ్రూర్ (పంజాబ్): మత ఆచారాన్ని సైతం పక్కన పెట్టి నలుగురు యువకుల ప్రాణాలు కాపాడేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం అతడిని హీరోని చేసింది. అతడే 24 ఏళ్ల ఇందర్ పాల్ సింగ్. మత ఆచారాన్ని మించి అతడు చూపించిన మానవత్వానికి అందరూ జేజేలు కొడుతున్నారు. సిక్కులు అనే కాదు ఎవరైనా సరే వారి మత ఆచారాలను పక్కన పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం సాటి వ్యక్తులను కాపాడటమే తన ప్రథమ కర్తవ్యంగా భావించి తలపాగాను తీసి, మరో సిక్కు యువకుడి సహాయంతో వారిని రక్షించాడు. గణేష్ నిమజ్జనంలో భాగంగా సునం గ్రామానికి చెంవదిన నలుగురు యువకులు ఇంద్రపాల్ సింగ్, జీవన్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, ఇందర్ తివారీ కెనాల్ గోడపై నిలుచున్నారు. అనుకోకుండా ఒకే సారి పెద్ద ఎత్తున నీరు రావడంతో అదుపుతప్పి వాళ్లు నీళ్లలో పడిపోయారు. కెనాల్ లో నలుగురు యువకులు చిక్కుకుని కొట్టుకుపోవడాన్ని ఇందర్ పాల్ సింగ్ గమనించాడు. వీరిని కాపాడటానికి తొలుత ఒక వైరుని వీళ్లకి అందించాడు. కానీ అది తెగిపోవడంతో మరోదారిలేక అక్కడే గట్టుపై కూర్చున్న ఇంద్రపాల్ సింగ్ తన తలపాగాని తీసి వారికి ఇచ్చాడు. ఒడ్డు పైనే ఉన్న మరో సిక్కు యువకుడు ఆ తల పాగా సహాయంతో నలుగురు యువకులు నీళ్లలో కొట్టుకు పోకుండా ఒక్కొక్కరిని ఒడ్డుకు లాగి కాపాడాడు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియోని చూసిన వారందరు ఇందర్ పాల్ చూపించిన మానవత్వానికి జేజేలు కొడుతున్నారు. -
మతాన్ని మించిన మానవత్వం...
-
భలే భలే రూపాలు...
మహా నగర రహదారులపై జన ప్రవాహం. అడుగడుగునా గణనాథుల కోలాహలం. విభిన్న రూపాల్లో విఘ్నాధిపతి విహారం. వీధి వీధినా వినాయకుడి నామస్మరణం. హుస్సేన్ సాగర్‌లో భక్తి తరంగాల సందోహం. ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక సంరంభం. వేలాది వాహనాల్లో... లక్షలాది మంది ప్రజలను ధన్యులను చేస్తూ పార్వతీ సుతుని పయనం... ఇదీ గణేశ నిమజ్జన వేళ భాగ్యనగరి చిత్రం. ఆదివారం ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర అర్ధరాత్రి దాటినా కొనసాగుతోంది. సాగర్‌లో రాత్రి 12 గంటల వరకూ 6,893 విగ్రహాలు నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్ష గణపతి సోమవారం తెల్లవారుజామున శోభాయాత్రకు సిద్ధమయ్యాడు. సిటీబ్యూరో నిమజ్జన శోభాయాత్రలో గణపతి రూపాలు చూసి జనం కేరింతలు కొట్టారు. విభిన్న గణపతులు ఆకట్టుకున్నాయి. బొజ్జగణపయ్య వేల వేల రూపాల్లో కనువిందు చేశాడు. భజనలు, కోలాటాలు, నత్యాలు, డప్పుదరువులతో ట్యాంక్‌బండ్ హోరెత్తింది. కులాలు, మతాలకు అతీతంగా ప్రజలంతా వేడుకలకు తరలివచ్చారు. అడుగడుగునా మతసామరస్యం వెల్లివిరిసింది. వైవిధ్యభరితమైన రూపాలలో కదిలివచ్చిన వక్రతుండ మహారాజు భక్తజనులను కట్టిపడేశాడు. విభిన్న గణపతులు... శివతాండవమాడుతున్న నృత్యకారుడిగా, బాహుబలిగా, జినుక రూపుగా, సైనికుడి రూపంలో కట్టప్పగా, డ్రై ప్రూట్స్, వివిధ రకాల పండ్లతో కొలువు ధీరిన ప్రశాంతమూర్తిగా, అందమైన కిరీటధారిగా, వేంకటేశ్వరుడి అవతారంగా అనేక రూపాల్లో బొజ్జగణపయ్య ఆకట్టుకున్నాడు. చిట్టి పొట్టి విగ్రహాలు... చిట్టి పొట్టి విగ్రహాలు ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో నిమజ్జనానికి తరలి వచ్చాయి. అనేక మంది భక్తులు ద్విచక్ర వాహనాలపైన, చిన్న చిన్న బండ్లపైన, కార్లల్లో వినాయక విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పైకి తీసుకొచ్చారు. కొందరు స్వయంగా దేవదేవుడుని నెత్తిన మోసుకొని వచ్చారు. గణపతిపై రైతు స్లోగన్.... అత్తాపూర్‌లోని రాంబాద్కు చెందిన చిరు డ్రై ప్రూట్స్‌తో రూపొందించిన గణపతి విగ్రహాంపై రైతులను ప్రభుత్వం కాపాడాలని రాసిన నినాదాలు చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. సెల్ఫీలు...సెల్ఫోన్ల సందడి... నిమజ్జన వేడుకల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై యువోత్సాహం పెల్లుబికింది. పిల్లలు, పెద్దలు, ఇంటిల్లిపాదీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచే ట్యాంక్‌బండ్‌పైకి చేరుకున్నారు. వేలాది మంది భక్తులు తమ ఇష్ట దైవాన్ని సెల్ఫోన్లలో బంధించటంతోపాటు,సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. గాయాలు..మిస్సింగ్ శోభాయాత్ర సందర్భంగా లుంబినీ పార్కు వద్ద గణపతిని తరలిస్తున్న లారి ఢీకొని అభిషేక్ అనే విద్యార్థి గాయపడ్డాడు. చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ట్యాంక్‌బండ్ ప్రాంతంలో తప్పిపోయిన వంద మందిని వారి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. తెలంగాణ చిత్ర పటంతో గణపతి తెలంగాణ రాష్ర్టంలో జరుగుతున్న మొట్టమొదటి గణపతి వేడుకలను ప్రతిబింబించేవిధంగా మహబుబ్‌నగర్ జిల్లాకు చెందిన భక్తులు 10 జిల్లాలలో కూడిన పేపరు చిత్ర పటంలో రూపొందించిన గణనాథుడు ఆకర్షణగా నిలిచాడు. -
గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి
ధారూరు, న్యూస్‌లైన్: గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సర్వీస్ తీగ తెగిపడి విద్యుదాఘాతమవడంతో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఏకైక కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ సంఘటన మండల పరిధిలోని నాగసమందర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగసమందర్‌లో మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో నిమజ్జనం చేసేందుకు ఎస్సీ కాలనీ, గొల్ల కాలనీల నుంచి వినాయక విగ్రహాలను ఊరేగింపుతో తరలిస్తున్నారు. నిర్వాహకులు అనుమతి లేకున్నా డీజే పెట్టారు. ఊరేగింపు నర్సప్ప గుడి ప్రధాన రోడ్డు దగ్గరికి చేరుకుంది. సారా రాంచంద్రయ్య ఇంటికి విద్యుత్ సరఫరా చేసే తీగ ట్రాక్టర్‌పై ఉన్న డీజే సౌండ్ బాక్సులకు తగిలి తెగిపోయింది. దీంతో తీగ ఊరేగింపులో నృత్యం చేస్తున్న యువకుడు బి. బాల్‌రాజ్(18)పై పడింది. అప్పటికే జోరు వాన ఉండడం, కరెంట్ సరఫరా అవడంతో అతడికి విద్యుదాఘాతమై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. బాల్‌రాజ్‌కు సమీపంలో ఉన్న ఎన్కెపల్లి రాములు, అనంతయ్యలతో పాటు డీజే ఆపరేటర్లు ఇద్దరు విద్యుదాఘాతంతో గాయపడ్డారు. స్థానికులు వెంటనే సబ్ స్టేషన్‌కు ఫోన్‌చేసి కరెంట్ సరఫరాను నిలిపివేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని వెంటనే ఆటోలో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. డీజే విషయమై ధారూరు ఎస్ఐని వివరణ కోరగా.. తమ నుంచి నిర్వాహకులు డీజే ఏర్పాటుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదన్నారు. యువకుడి మృతిపై కూడా ఫిర్యాదు అందలేదని చెప్పారు. శోకసంద్రంలో కుటుంబీకులు భీమప్ప, అమృతమ్మ దంపతులకు కుమారుడు బాల్‌రాజ్ , కూతురు సంగీత ఉన్నారు. అప్పటి వరకు తమముందు ఉల్లాసంగా ఉన్న కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండెలుబాదుకున్నారు. బాల్‌రాజ్ 6వ తరగతి వరకు చదివాడు. తాండూరులో బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ చెల్లెలు సంగీత(7వ తరగతి)ను చదివిస్తున్నాడు. కుటుంబాన్ని ఆదుకుంటావనుకుంటే అంతలోనే చనిపోయావా... కొడుకా..? అని అమృతమ్మ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బాల్‌రాజ్ మృతితో నాగసమందర్‌లో విషాదం అలుముకుంది.