భలే భలే రూపాలు...
మహా నగర రహదారులపై జన ప్రవాహం. అడుగడుగునా గణనాథుల కోలాహలం. విభిన్న రూపాల్లో విఘ్నాధిపతి విహారం. వీధి వీధినా వినాయకుడి నామస్మరణం. హుస్సేన్ సాగర్‌లో భక్తి తరంగాల సందోహం. ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక సంరంభం. వేలాది వాహనాల్లో... లక్షలాది మంది ప్రజలను ధన్యులను చేస్తూ పార్వతీ సుతుని పయనం... ఇదీ గణేశ నిమజ్జన వేళ భాగ్యనగరి చిత్రం. ఆదివారం ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర అర్ధరాత్రి దాటినా కొనసాగుతోంది. సాగర్‌లో రాత్రి 12 గంటల వరకూ 6,893 విగ్రహాలు నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్ష గణపతి సోమవారం తెల్లవారుజామున శోభాయాత్రకు సిద్ధమయ్యాడు.
సిటీబ్యూరో నిమజ్జన శోభాయాత్రలో గణపతి రూపాలు చూసి జనం కేరింతలు కొట్టారు. విభిన్న గణపతులు ఆకట్టుకున్నాయి. బొజ్జగణపయ్య వేల వేల రూపాల్లో కనువిందు చేశాడు. భజనలు, కోలాటాలు, నత్యాలు, డప్పుదరువులతో ట్యాంక్‌బండ్ హోరెత్తింది. కులాలు, మతాలకు అతీతంగా ప్రజలంతా వేడుకలకు తరలివచ్చారు. అడుగడుగునా మతసామరస్యం వెల్లివిరిసింది. వైవిధ్యభరితమైన రూపాలలో కదిలివచ్చిన వక్రతుండ మహారాజు భక్తజనులను కట్టిపడేశాడు.
విభిన్న గణపతులు...
శివతాండవమాడుతున్న నృత్యకారుడిగా, బాహుబలిగా, జినుక రూపుగా, సైనికుడి రూపంలో కట్టప్పగా, డ్రై ప్రూట్స్, వివిధ రకాల పండ్లతో కొలువు ధీరిన ప్రశాంతమూర్తిగా, అందమైన కిరీటధారిగా, వేంకటేశ్వరుడి అవతారంగా అనేక రూపాల్లో బొజ్జగణపయ్య ఆకట్టుకున్నాడు.
చిట్టి పొట్టి విగ్రహాలు...
చిట్టి పొట్టి విగ్రహాలు ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో నిమజ్జనానికి తరలి వచ్చాయి. అనేక మంది భక్తులు ద్విచక్ర వాహనాలపైన, చిన్న చిన్న బండ్లపైన, కార్లల్లో వినాయక విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పైకి తీసుకొచ్చారు. కొందరు స్వయంగా దేవదేవుడుని నెత్తిన మోసుకొని వచ్చారు.
గణపతిపై రైతు స్లోగన్....
అత్తాపూర్‌లోని రాంబాద్‌కు చెందిన చిరు డ్రై ప్రూట్స్‌తో రూపొందించిన గణపతి విగ్రహాంపై రైతులను ప్రభుత్వం కాపాడాలని రాసిన నినాదాలు చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.
సెల్ఫీలు...సెల్‌ఫోన్ల సందడి...
నిమజ్జన వేడుకల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై యువోత్సాహం పెల్లుబికింది. పిల్లలు, పెద్దలు, ఇంటిల్లిపాదీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచే ట్యాంక్‌బండ్‌పైకి చేరుకున్నారు. వేలాది మంది భక్తులు తమ ఇష్ట దైవాన్ని సెల్‌ఫోన్‌లలో బంధించటంతోపాటు,సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.
గాయాలు..మిస్సింగ్
శోభాయాత్ర సందర్భంగా లుంబినీ పార్కు వద్ద గణపతిని తరలిస్తున్న లారి ఢీకొని అభిషేక్ అనే విద్యార్థి గాయపడ్డాడు. చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ట్యాంక్‌బండ్ ప్రాంతంలో తప్పిపోయిన వంద మందిని వారి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.
తెలంగాణ చిత్ర పటంతో గణపతి
తెలంగాణ రాష్ర్టంలో జరుగుతున్న మొట్టమొదటి గణపతి వేడుకలను ప్రతిబింబించేవిధంగా మహబుబ్‌నగర్ జిల్లాకు చెందిన భక్తులు 10 జిల్లాలలో కూడిన పేపరు చిత్ర పటంలో రూపొందించిన గణనాథుడు ఆకర్షణగా నిలిచాడు.