గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి
Published Thu, Sep 19 2013 3:58 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
ధారూరు, న్యూస్‌లైన్: గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సర్వీస్ తీగ తెగిపడి విద్యుదాఘాతమవడంతో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఏకైక కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ సంఘటన మండల పరిధిలోని నాగసమందర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగసమందర్‌లో మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో నిమజ్జనం చేసేందుకు ఎస్సీ కాలనీ, గొల్ల కాలనీల నుంచి వినాయక విగ్రహాలను ఊరేగింపుతో తరలిస్తున్నారు. నిర్వాహకులు అనుమతి లేకున్నా డీజే పెట్టారు. ఊరేగింపు నర్సప్ప గుడి ప్రధాన రోడ్డు దగ్గరికి చేరుకుంది.
సారా రాంచంద్రయ్య ఇంటికి విద్యుత్ సరఫరా చేసే తీగ ట్రాక్టర్‌పై ఉన్న డీజే సౌండ్ బాక్సులకు తగిలి తెగిపోయింది. దీంతో తీగ ఊరేగింపులో నృత్యం చేస్తున్న యువకుడు బి. బాల్‌రాజ్(18)పై పడింది. అప్పటికే జోరు వాన ఉండడం, కరెంట్ సరఫరా అవడంతో అతడికి విద్యుదాఘాతమై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. బాల్‌రాజ్‌కు సమీపంలో ఉన్న ఎన్కెపల్లి రాములు, అనంతయ్యలతో పాటు డీజే ఆపరేటర్లు ఇద్దరు విద్యుదాఘాతంతో గాయపడ్డారు. స్థానికులు వెంటనే సబ్ స్టేషన్‌కు ఫోన్‌చేసి కరెంట్ సరఫరాను నిలిపివేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని వెంటనే ఆటోలో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. డీజే విషయమై ధారూరు ఎస్‌ఐని వివరణ కోరగా.. తమ నుంచి నిర్వాహకులు డీజే ఏర్పాటుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదన్నారు. యువకుడి మృతిపై కూడా ఫిర్యాదు అందలేదని చెప్పారు.
శోకసంద్రంలో కుటుంబీకులు
భీమప్ప, అమృతమ్మ దంపతులకు కుమారుడు బాల్‌రాజ్ , కూతురు సంగీత ఉన్నారు. అప్పటి వరకు తమముందు ఉల్లాసంగా ఉన్న కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండెలుబాదుకున్నారు. బాల్‌రాజ్ 6వ తరగతి వరకు చదివాడు. తాండూరులో బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ చెల్లెలు సంగీత(7వ తరగతి)ను చదివిస్తున్నాడు. కుటుంబాన్ని ఆదుకుంటావనుకుంటే అంతలోనే చనిపోయావా... కొడుకా..? అని అమృతమ్మ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బాల్‌రాజ్ మృతితో నాగసమందర్‌లో విషాదం అలుముకుంది.
Advertisement
Advertisement