
విరసం నేతలపై కేసు ఎందుకు?
♦ గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో కొత్త కోణం
వరవరరావుపై జూన్ 25వ తేదీన
♦ నల్లగొండ కోర్టులో పిటిషన్ వేయించిన నయీమ్
♦ నయీమ్ సూచన మేరకే న్యాయవాది ఛత్రపతితో కేసు
♦ పోలీసు విచారణలో వెల్లడించిన ఐటెన్ న్యూస్ సీఈవో
♦ హాని తలపెట్టే ఆలోచనతోనే అంటున్న పోలీసు వర్గాలు
నల్లగొండ క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో మరో కొత్త కోణంపై పోలీసులు దృష్టి సారించారు. ఎప్పటి నుంచో మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నయీమ్ తాజాగా విరసం నేతలపై కేసులు ఎందుకు వేయించారనే కోణంలో నల్లగొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విరసం నేతలు వరవరరావు, విజయలక్ష్మి, కాసీంలపై కోర్టులో కట్టంగూరుకు చెందిన న్యాయవాది ఛత్రపతి ద్వారా నల్లగొండ కోర్టులో జూన్ 25న పిటిషన్ వేశామని, ఈ పిటిషన్‌లో విరసం నేతలు హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశాల వీడియో క్లిప్పింగులను కూడా జత చేశామని పోలీసు విచారణలో నయీమ్ అనుచరుడు, ఐటెన్ న్యూస్ సీఈవో బి. హరిప్రసాదరెడ్డి వెల్లడించినట్టు తెలుస్తోంది.
నయీమ్ ఫోన్ చేసి విరసం నేతలపై కోర్టులో పిటిషన్ వేయాలని, ఇందుకు గాను న్యాయవాది ఛత్రపతిని కలవాలని ఆదేశించాడని, ఆ మేరకే తాము ఆ పనిచేశామని పోలీసులకు హరి చెప్పినట్టు తెలుస్తోంది. కోర్టు ఆ పిటిషన్‌ను స్వీకరించలేదు కానీ.. కేసు ఎందుకు వేయించారనే కోణంలో పోలీసు దర్యాప్తు జరుగుతున్నట్టు సమాచారం. విరసం నేతలపై కేసు వేయడం ద్వారా వారు కోర్టు విచారణకు నల్లగొండకు రావాల్సిన పరిస్థితులను కల్పించాలని, ఆ క్రమంలో హాని తలపెట్టాలనే ఆలోచన నయీమ్ చేసి ఉంటాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
గతంలో కూడా పౌరహక్కుల నేత ఆజం అలీని నల్లగొండలోనే నయీమ్ అనుచరులు హత్య చేశారని, కేసు వేయించేందుకు ప్రధాన కారణం ఏమిటనేది రాబడుతున్నామని అయితే, హరిని మరోసారి పోలీసు క స్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోనికి వస్తాయని పోలీసులంటున్నారు.