గంజాయి రవాణాలో సీఐ పాత్ర | GANJA TRANSPORT.. CI INVOLVEMENT | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణాలో సీఐ పాత్ర

Published Sat, Mar 11 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

GANJA TRANSPORT.. CI INVOLVEMENT

సాక్షి ప్రతినిధి, ఏలూరు :  గంజాయి రవాణాలో పోలీసుల పాత్ర ఆ శాఖకు చెడ్డపేరు తెస్తోంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి రవాణా వెనుక అక్కడి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ హస్తం వెలుగుచూసిన సంగతి తెలిసిందే.  మన జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పనిచేస్తున్న మరో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కూ ఈ వ్యవçహారంతో సంబంధాలు ఉన్నట్టు తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై గంజాయి రవాణాను అడ్డుకోవడం కోసం నియమిం చిన ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఈ విచారణలో నిందితుడు జిల్లాలోని పోలీస్‌ అధికారితో తమకున్న సంబంధాలను పూర్తిగా వివరించినట్టు తెలుస్తోంది.  గత నెల 21న జిల్లాలో ఒక గంజాయి లారీని పట్టుకున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధాన నిందితుడిని వదిలేసేందుకు ఓ పోలీస్‌ అధికారి రూ.4 లక్షలు లంచం తీసుకున్నట్టు సమాచారం. దీనికి స్థానికంగా ఉన్న కొందరు ఛానల్‌ విలేకరులు డీల్‌ కుదిర్చారని, ప్రధాన నిందితుడు ప్రతినెలా ప్రతి లోడుకు కొంత మామూలు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలిసింది. ఫిబ్రవరి 21న గంజాయి లారీ పట్టుకున్న సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో జాప్యంపై కూడా విచారణ చేసినట్టు సమాచారం. పైస్థాయి అధికారులకు సమాచారం అందడంతో లారీని పట్టుకున్నట్టు చూపించారని తెలి సింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పండించిన గంజాయిని హైదరాబాద్, మహారాష్ట్రకు రవాణా చేయడంలో భాగంగా జిల్లాలోని చింతలపూడి మండలం నుంచి రాష్ట్ర  సరిహద్దు దాటిస్తున్నారు. అయితే గంజాయి లారీని జిల్లాలో ఎక్కడా ఆపకుండా ఉండేందుకు ప్రతి లోడుకు ఇంతని మామూలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. గతనెల గంజాయి కేసులో ప్రధాన నిందితుడు గన్నవరం సబ్‌ జైల్‌ వద్ద  ప్రత్యేక బృందాలకు దొరికిపోయాడు. అక్కడ గంజాయి కేసులో సబ్‌జైల్‌లో ఉన్న ఒక నిందితుడిని కలిసేందుకు అతను వస్తున్నట్టు నిఘా విభాగం సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు మాటువేసి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ నిందితుడిని రహస్య స్థావరానికి తరలించి తమదైన శైలిలో విచారించగా ఎవరెవరికి నెల మామూళ్లు ఇచ్చేది, దీనిలో పోలీసు అధికారులు ఎవరున్నారు, రాజకీయ నాయకులు ఎవరున్నారనేది వెల్లడించినట్టు సమాచారం. మెట్ట ప్రాంతానికి చెందిన ఒక సీఐ కీలక పాత్ర పోషిస్తున్నాడని, కొందరు ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరులు కూడా సహకరిస్తున్నట్టు తెలియటంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు సదరు సీఐ పేరు చెప్పడంతో పాటు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చింది వివరించినట్టు తెలిసింది.  విచారణాధికారులు ఈ విషయాన్ని డీజీపీ సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లగా, ప్రధాన నిందితుడిని పూర్తిస్థాయిలో విచారించి ఇంటి దొంగలను పట్టుకుని జిల్లా ఎస్పీకి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లా ఉన్నతాధికారులు కూడా సదరు అధికారిపై ఇప్పటికే పలు నివేదికలు పంపినట్టు తెలిసింది. ధర్మాజీగూడెంలో ఓ ప్రేమజంట వ్యవహారంలో ఆ అధికారి అధీనంలో ఉన్న యువతిని అమె తరుఫువారు సినీ ఫక్కీలో తీసుకెళ్లిపోయారు. ఆ అధికారే సరిహద్దులో గ్రానైట్‌ లారీలను దాటించే పనిలో ఉండటంతో రవాణా శాఖాధికారులు అతనిపై చర్యలకు ఎస్పీకి సిఫార్సు చేశారు. అధికార పార్టీ అండదండలు ఉండటంతో అతనిపై చర్యలు తీసుకుంటారా? వదిలేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement