చైతన్య దీప్తి.. గజల్ శ్రీనివాస్
చైతన్య దీప్తి.. గజల్ శ్రీనివాస్
Published Fri, Oct 14 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
విజయవాడ కల్చరల్ : గజల్ శ్రీనివాస్ చైతన్య దీప్తి, పోరాట స్ఫూర్తి అని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. యువ కళావాహిని, డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ సంయుక్తంగా గజల్ శ్రీనివాస్ 40 వసంతాల గానోత్సవం కార్యక్రమం నగరంలోని సంగీత కళాశాలలో శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ తెలుగు గజళ్లకు ప్రాణప్రతిష్టచేసిన వ్యక్తి శ్రీనివాస్ అని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం, తెలుగు భాషాకోసం తన గళాన్ని ఆయుధంగా మలచుకొన్నారని పేర్కొన్నారు. విశాఖ శారదాపీఠం ప్రభుత్వ విధానాలను ఏనాడూ సమర్థించలేదని స్పష్టంచేశారు. రాజీలేని పోరాటమే శారదాపీఠం లక్ష్యమని అన్నారు. విజయవాడలో ఆలయాలను కూల్చివేయడం దారుణమని, దేవాలయాలను, భగవంతున్ని పూజించాలని పిలుపు నిచ్చారు. శాసన సభ సభాపతి కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ కళలు సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష కోసం గాంధీ మార్గంలో పోరాటం చేసిన వ్యక్తి శ్రీనివాస్ అని అభినందించారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మాజీ మంత్రి మాణì క్యవరప్రసాద్, క్రీడాకారిణి కోనేరు హంపి, మహాసహస్రావధాని డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ తదితరులు ప్రసంగించారు. గజల్ శ్రీనివాస్ 40 వసంతాల గాన జీవితం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి తదితరులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. గజల్ శ్రీనివాస్ రేడియో వెబ్‌ను స్పీకర్ కోడెల ప్రారంభించారు. అనంతరం గజల్ గాయకులు రెంటాల వెంకటేశ్వరరావు, రసరాజు, పి.వి.వి.రామరాజు, రవికుమార్, సిరాశ్రీ తదితరులను నిర్వాహకులు సత్కరించారు. ఆర్‌వీఎస్ రచించిన పున్నమి పూలు గజల్ పుస్తకాన్ని మండలి ఆవిష్కరించారు. గజల్ అంశంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు జరిగిన సత్కారానికి అభినందనలు తెలిపారు. తన గాయక ప్రస్థానంలో చోటుచేసుకున్న అనేక సంఘటనలను వివరించారు.
Advertisement
Advertisement