భక్తి పారవశ్యం.. నాట్య సమ్మోహనం
భక్తి పారవశ్యం.. నాట్య సమ్మోహనం
Published Fri, Sep 9 2016 5:59 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
విజయవాడ కల్చరల్ : డూండీ గణేశ్ సేవా సమితి నిర్వహణలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలోని గోకరాజు గంగరాజు కళావేదికపై నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను భక్తిరస సంద్రంలో ముంచెత్తుతున్నాయి. గురువారం నాటి కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభంలో సుసర్లనందిని వీణావాదన హృద్యంగా సాగింది. అన్నమయ్య, రామదాసు తదితర వాగ్గేయకార కీర్తనలు ఆలపించారు. సత్యనారాయణపురానికి చెందిన లలిత బృందంలోని చిన్నారులు 72 అడుగుల వినాయక విగ్రహం ముందు కోలాటం ప్రదర్శించారు. మహిళా భక్తులు సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిగా నాట్యాచార్యుడు ఘంటసాల పవన్‌కుమార్ బృందం పలు అంశాలకు నాట్యాన్ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమాలను శింగంశెట్టి పెదబ్రహ్మం, చింతకాయల చిట్టిబాబు నిర్వహించారు.
ధర్మరక్షణే మన కర్తవ్యం
ధర్మరక్షణే మన కర్తవ్యమని కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి అనుగ్రహ భాషణ చేశారు. గురువారం సాయంత్రం 72 అడుగుల గణనాథుడిని సిద్ధేశ్వరానంద భారతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన భారతీయ సంప్రదాయాలను కాపాడుకోవాలని, నియమబద్ధమైన జీవితం గడపాలని పిలుపునిచ్చారు. తొలుత స్వామీజీకి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Advertisement
Advertisement