బాలుడిని కాపాడిన వైద్యులు
బాలుడిని కాపాడిన వైద్యులు
Published Tue, Jul 26 2016 8:03 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
సైకిల్ తొక్కుతూ కిందపడి గాయపడిన శ్రీరామకృష్ణ నాయక్
గుంటూరు మెడికల్ : సైకిల్ తొక్కుతూ జారిపడి గొంతు వాపు, ఛాతి వాపు సమస్యతో ఆసుపత్రికి వచ్చిన బాలుడు కోమాలోకి వెళ్లడంతో మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాపాయ స్థితి నుంచి అతనిని కాపాడినట్లు గుంటూరు జీజీహెచ్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ మెగావత్ మోతిలాల్ చెప్పారు. ఆసుపత్రిలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్చంపేట మండలం, తాడవాయి తండాకు చెందిన భుక్కా భాస్కర్‌నాయక్, సాయిబాయి రెండో కుమారుడు శ్రీరామకృష్ణ నాయక్ S ఈనెల 19న ఇంటి వద్ద సైకిల్ తొక్కుతూ పడిపోయాడు. గొంతు మధ్య భాగంలో బలమైన గాయం, విపరీతమైన నొప్పి, ఛాతిపైన వాపుతో చికిత్స కోసం అదేరోజు జీజీహెచ్‌కు అచ్చంపేట వైద్యుల సూచనల మేరకు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అదేరోజు రాత్రి సీటీ స్కాన్, చెస్ట్ ఎక్స్‌రే పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసుకున్నారు. ఛాతి కుడివైపు భాగంలో, ఒళ్ళంతా చెడు గాలి చేరడం వల్ల వాపు వచ్చిందని, దీన్ని వైద్య పరిభాషలో సర్జికల్ ఎంఫైసియా, నిమో థొరాక్స్‌గా పిలుస్తారని డాక్టర్ మోతిలాల్ చెప్పారు. పక్కటెముకలకు గొట్టం అమర్చి వాపు తగ్గిస్తున్న సమయంలో పిల్లవాడికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడని, నాలుగు రోజులపాటు కోమాలోనే ఉన్నాడని వెల్లడించారు. సీటీ బ్రెయిన్ పరీక్ష చేసి శరిబ్రల్ ఎడిమాగా నిర్ధారణ చేశామని, మెడలో నీరు చేయడం వల్ల బాలుడు కోమాలోకి వెళ్ళినట్లు నిర్ధారణ చేశామన్నారు. నాలుగు రోజుల పాటు మెరుగైన వైద్య సేవలు అందించి కోమాలో చనిపోయే స్థితిలో ఉన్న పిల్లవాడిని తిరిగి బతికించామని డాక్టర్ మోతిలాల్ వివరించారు. జీజీహెచ్ సీటీఎస్ వైద్య విభాగంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. బాలుడి ప్రాణాలు రక్షించిన డాక్టర్ మోతిలాల్‌కు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడిని మంగళవారం డిశ్చార్జి చేశారు.
Advertisement
Advertisement