సంకల్పంతో ముందడుగు వేయాలి
-
ప్రతి విద్యార్థి పారిశ్రామిక వేత్తగా ఎదగాలి
-
జేఎన్‌టీయూకే వీసీ ఆచార్య వీఎస్‌ఎస్ కుమార్
-
గైట్‌లో ప్రారంభమైన సాంకేతిక ఉత్సవాలు
వెలుగుబంద (రాజానగరం) :
నేడు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి రేపు ఒక మంచి పారిశ్రామికవేత్త కావాలనే సంకల్పంతో ముందడుగు వేయాలని జేఎన్‌టీయూకే వైస్‌చాన్సలర్ ఆచార్య వీఎస్‌ఎస్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక గైట్ కళాశాలలో రెండు రోజులపాటు జరిగే సాంకేతిక ఉత్సవాలను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్య అనంతరం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా పారిశ్రామికవేత్తలుగా తయారయ్యేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ఇటువంటి సాంకేతిక ఉత్సవాల్లో పాల్గొనడం వలన పరిజ్ఞానాన్నివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. భారతదేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని చైతన్య విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు అన్నారు. దేశంలోను, రాష్ట్రంలోను అపారంగా ఉద్యోగావకాశాలు ఉన్నాయని, వాటిని యువ ఇంజనీర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నైపుణ్యం ఉన్నవాడికి ఉపాధికి కొదవ ఉండదన్నారు. అలాగే కొత్తవారితో పరిచయాల ద్వారా విజ్ఞాన్నాన్ని పెంపొందించుకునేందుకు, పరస్పరం పంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కారణంగానే ఏటా ఇంజనీర్స్ డే సందర్భంగా తమ కళాశాలల్లో సాంకేతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కళాశాలలో త్వరలో జాతీయ స్థాయిలో ఐటీఐ వర్క్‌షాపును నిర్వహించాలని ప్రిన్సిపాల్స్‌కి ఆయన సూచించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల ఆలోచనల్లో ఒక ప్రత్యేకత ఉండాలని, విన్నూతమైన ఆలోచనలతో కొత్తఒరవడికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని ఒడిస్సాకు చెందిన బిజూపట్నాయక్ యూనివర్సిటీ విశ్రాంత వీసీ, ఆర్‌ఎస్‌బీ మెటల్ టెక్ డైరెక్టర్ డాక్టర్ ఓంకార్‌నాథ్ మహంతి అన్నారు. ఇంజనీరింగ్ డే సందర్భంగా తమ కళాశాలలో ప్రస్తుతం 15వ మేథ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సమావేశానికి అధ్యక్షత వహించిన చైతన్య విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్‌ఎన్ రాజు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించనున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి తెలిపారు. అలాగే ఫ్రీ పొల్యూషన్ చెకప్ క్యాంప్ నిర్వహించి వాహనచోదకుల నుంచి ప్రతిజ్ఞ పత్రాలను తీసుకుంటున్నామన్నారు.
సర్ మోక్షగుండంకు నివాళులు
ఇంజనీర్ల దినోత్సవం సందర్బంగా భారతరత్న, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి తొలుత పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. గైట్ అటోమొబైల్ ఇంజినీరింగ్ విద్యార్థి తయారు చేసిన బైక్ ట్రాన్స్‌ఫార్మర్ రోబోను అతిథులు పరిశీలించి, ఆ విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్. సూర్యనారాయణరాజు, డాక్టర్ కపిలేశ్వరమిశ్రా, వైస్‌ప్రిన్సిపాల్ జగన్నాధరాజు, డీన్ డాక్టర్ వరప్రసాదరావు, డైరెక్టర్స్ డాక్టర్ ఎల్‌ఎస్ గుప్త, డాక్టర్ పీఆర్‌కె రాజు, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.