రైలు నుంచి జారిపడిన బాలిక మృతి
Published Mon, Oct 17 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
బేతంచెర్ల: రైలు నుంచి జారి పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ దుర్ఘటన కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం హెచ్ కొట్టాల రైల్వే గేట్, ఆర్‌ఎస్ రంగాపురం రైల్వే గేట్ మధ్యలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం జిల్లా మరి మృధం మండలం మరివలస గ్రామానికి చెందిన పైడిరాజు, లక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. పైడిరాజు కర్ణాటక రాష్ట్రంలో క్రేన్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గ్రామంలో పండగ ఉండటంతో అతని తమ్ముడు రామయ్య.. వదిన లక్ష్మి, పిల్లలు హేమలత, రెండున్నర సంవత్సరాల చైత్రను తీసుకొని వాస్కోడిగామా టు హౌరా రైలులో ఊరికి బయలు దేరారు. మార్గమధ్యలో ఆర్‌ఎస్ రంగాపురం రైల్వే గేటు దాటిన తరువాత తల్లిలక్ష్మి చిన్నారి చైత్రను ఎత్తుకొని ఎమర్జన్సీ కిటికీ దగ్గర లాలిస్తుండగా వేరే వ్యక్తి నీళ్ల బాటిల్ అడిగాడు. బాటిల్ ఇచ్చే సమయంలో చిన్నారి చైత్ర ఎమ్మెర్జెన్సీ కిటికీలోనుంచి బయటకు జారి పడింది. చైన్ లాగే లోపే రైలు చాలా దూరం వచ్చింది. రైలు ఆపి గాలించినా కన్పించక పోవడంతో బేతంచెర్లకు అదే రైలులో చేరుకున్నారు. స్థానికులు కలిసి సంఘటన స్థలానికి వెల్లగా తీవ్ర రక్త గాయాలై కొన ఊపిరితో ఉన్న చైత్రను బేతంచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందిందని నిర్ధారించారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ బేతంచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. డోన్ రైల్వే ఎస్‌ఐ కృష్ణ మోహన్ కేసు నమోదు చేశారు. నీళ్ల బాటిలే కొంపముంచిందంటూ తల్లి రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది.
Advertisement
Advertisement