తేలుకాటుతో విద్యార్థిని మృతి
తేలుకాటుతో విద్యార్థిని మృతి
Published Thu, Aug 11 2016 11:18 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
పెద్దవంగలి(చాగలమర్రి): తేలుకాటుతో 3వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. పెద్దవంగలి గ్రామానికి చెందిన చాపల మాబుబాషా, బీబీ దంపతుల రెండో కుమార్తె సమీరా(8) స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం గ్రామంలోని మదర్సాకు వెళ్తూ మక్నా(స్కాఫ్)ను తలపై ధరించింది. దీంతో స్కాఫ్‌లో ఉన్న తేలు సమీరా కంటి కణితి భాగంలో కాటు వేసింది. విష ప్రభావంతో సొమ్మసిల్లి పడి పోయిన చిన్నారిని కుటుంబీకులు చాగలమర్రి కేరళా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం మృతి చెందింది. విద్యార్థిని మృతి చెందిన విషయం తెలసుకుకొన్న ఎంఈఓ అనురాధ, హెచ్‌ఎం శేషాద్రి, ఉపాధ్యాయులు, విద్యార్థులు చిన్నారి మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా గురువారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. అలాగే గ్రామ సర్పంచ్ కళ్యాణి, విద్యాకమిటీ చైర్మన్ మహబూబ్‌బాష, గ్రామ పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు. సమీరా విద్యతో పాటు క్రీడల్లో రాణించేదని పాఠశాల హెచ్‌ఎం తెలిపారు.
Advertisement