వ్యభిచార గృహం నుంచి బాలికకు విముక్తి
హసన్‌పర్తి : వ్యభిచార గృహం నుంచి ఓ బాలికకు గురువారం విముక్తి కలిగింది. సిద్ధాపురంలో అమ్మాయిలతో బలవంతంగా వ్యభిచారవృత్తి చేయిస్తున్నారనే నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు హసన్‌పర్తి ఎస్సై పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం... సిద్ధాపురానికి చెందిన ముస్కు పోచాలు, ముస్కు సీత, ముస్కు రఘు వేశ్యాగృహం నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల నుంచి ఓ బాలికను రూ.20వేలకు కొనుగోలు చేసి 20 రోజుల క్రితం తీసుకువచ్చి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు దాడి నిర్వహించారు.
ఈ బాలికతోపాటు మరో ఐదుగురు అమ్మాయిలను సైతం పోలీసులు గుర్తించారు. వారు మేజర్ కావడంతో కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. కాగా సిరిసిల్లకు చెందిన వేశ్యాగృహ నిర్వాహకురాలు స్వాతి మూడు నెలల క్రితం ఆ బాలికను ఖమ్మం నుంచి తీసుకువచ్చినట్లు తెలిసింది. వేశ్యాగృహం నుంచి విముక్తి పొందిన బాలికను పోలీసులు నగరంలోని బాలిక సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలికకు తల్లిదండ్రులు లేరని తెలిసింది. దీంతో ఆ బాలికను మభ్యపెట్టి వ్యభిచార రొంపిలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బాలికతో వ్యభిచారం చేయించిన పోచాలు, సీత, రఘుతోపాటు సిరిసిల్లకు చెందిన స్వాతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.