♦ చదువుల తల్లికి అరుదైన కంటి వ్యాధి
♦ చూపు కోల్పోయిన ప్రతిభావంతురాలు
♦ వైద్యం చేయించని పేద కుటుంబం
♦ దాతలు కరుణించాలని వినతి
పసివాడో ఏమిటో ఆ పైవాడు.. తను చేసిన బొమ్మలతో తలపడతాడు.. అని రాశాడో సినీకవి. విజ్ఞానంతో విరిసిన ఆ నయనాలు నల్ల కలువలవుతుంటే ఈ గీతమే గుర్తొస్తోంది. బంగారు స్వప్నాల్ని కన్న కనులను అంధకారం కమ్మేస్తుంటే ప్రతి కన్ను చెమర్చుతోంది. అరుదైన కంటి జబ్బు అభం శుభం తెలియని చిన్నారిని కాటేస్తుంటే పాషాణుల్ని సైతం కరిగిస్తుంది. ఆ దురదృష్టవంతురాలు.. కొత్తవలస మండలం కంటకాపల్లికి చెందిన విద్యార్థిని శ్రావణి. ఈ ప్రతిభావంతురాలి బతుకులో ‘టాకయ్యాస్‘ అనే నరాల వ్యాధి నిప్పులు పోసింది. కంటిచూపును కబళించేసింది. అత్యంత ఖరీదైన వైద్యం చేయిస్తే తప్ప చూపు దక్కదని తెలిసిన ఆమె ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తోంది.
కొత్తవలస రూరల్:
కంటకాపల్లి ఎస్సీ కాలనీలో నివసిస్తున్న మాడుగుల సూర్యనారాయణ, వెంకటలక్ష్మికి ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె శ్రావణి ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. సూర్యనారాయణ శారదా కంపెనీలో కాంట్రాక్ట్ వర్కర్. శ్రావణి ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఎనిమిదో తరగతి వరకూ స్కూల్ టాపర్. చదువుల్లోనే కాదు ఆటపాటలు, వ్యాసరచన, అన్నింటిలోనూ ప్రథమస్థానమే. పోటీలకు వెళ్తే పతకం రావలసిందే. ఇంతటి ప్రతిభావంతురాలు ‘టాకయ్యాస్‘ అనే నరాల వ్యాధి ప్రభావంతో కంటిచూపును కోల్పోయింది.
ఇంజక్షన్ ఖరీదు రూ.70 వేలు
శ్రావణికి ఈఏడాది వేసవి సెలవుల్లో చూపు తగ్గటంతో విశాఖపట్నం వైద్యుల్ని సంప్రదించారు. వారు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు సిఫార్సు చేశారు. అక్కడి వైద్యులు శ్రావణిని పరీక్షించి లక్షమందిలో వచ్చే వ్యాధిగా గుర్తించారు. దీంతో ఈమెకు నెలకు రూ.70 వేల విలువైన ఇంజక్షన్ (స్టెరాయిడ్స్), రూ.2వేల విలువైన మాత్రలను ఆరు డోసులు ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రులు అతి కష్టంమీద
3 డోసులు వేయించారు. ఆర్థిక స్తోమత చాలక పోవటంతో దాతలు కరుణించాలని కన్నీటితో ప్రాధేయపడుతున్నారు. దాతలు 94910601931 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.
మనసున్న నేస్తాలు
శ్రావణి సహ విద్యార్థులు తమ ఇంటి వద్ద, దాచుకున్నవి, గ్రామంలో మొత్తం సుమారు రూ.లక్ష సేకరించి స్నేహితురాలి కంటిచూపు మెరుగుకు కృషి చేస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా తమ వంతు సాయం చేయాలని సంకల్పించారు.
వెలుగు ప్రసాదించండి
చదువులో ఎప్పుడూ ప్రథమ స్థానంలో నిలుస్తుండటంతో మా కుమార్తె ఉన్నత విద్య చదువుతుందని మురిసిపోయాం. కానీ భగవంతుడు ఇలా చేస్తాడని అనుకోలేదు. నరాల్లో ఎర్ర రక్తకణాలు స్పందించటం లేదని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. దాతలు స్పందించి మా కుమార్తె బతుకులో వెలుగు ప్రసాదించాలి.
– సూర్యనారాయణ, తండ్రి
ప్రభుత్వం ఆదుకోవాలి
అప్పులు చేసి ఇప్పటి వరకూ మూడు డోసులు వేయించాం. ఇంకా మూడు డోసులు వేయించాల్సి ఉంది. ఆ తరువాత వైద్యులు ఏం చెబుతారో భయంగా ఉంది. ప్రభుత్వం సాయం చేసి నా చిట్టి తల్లికి చూపు తెప్పించాలి. – వెంకటలక్ష్మి, తల్లి
సాయానికి ఎదురు‘చూపు’
Published Tue, Sep 19 2017 11:50 AM | Last Updated on Tue, Sep 19 2017 4:46 PM
Advertisement
Advertisement