రెండు వందల పనిదినాలు కల్పించాలి
రెండు వందల పనిదినాలు కల్పించాలి
Published Tue, Sep 20 2016 8:22 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ టౌన్ : ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి రెండువందల రోజుల పనిదినాలను కల్పించాలని, కనీసం రోజుకు రూ.350 కూలి చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ విజయరాఘవన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఉపాధి చట్టం దశాబ్ది ఉత్సవాల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయించేందుకు భూస్వాములు, పెట్టుబడిదారులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అదే పరిస్థితి ఏర్పడితే తిరిగి భూస్వాములకు ఊడిగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న ఉపాధి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని దళిత, గిరిజన, మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధిపథకం అమలుతీరుపై వ్యవసాయ కార్మిక సంఘం దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తుందని, సర్వే పూర్తి అయిన తరువాత ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. చట్టం పూర్తి స్థాయిలో అమలుకు వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చిన ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విడుదల చేయకుండా పక్కదారి పట్టిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం జరిగితే పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. జాతీయ కౌన్సిల్ సమావేశంలోపలు అంశాలపై చర్చించి చట్టాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించుకోవడానికి భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తామని తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు తిరుణవక్కరసు, జాతీయ సహాయ కార్యదర్శి సునిల్‌చోప్రా, కిసాన్‌సభ జాతీయ అధ్యక్షుడు హన్నన్‌మొల్లా, జాతీయ కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్రామయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్, సంఘం జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ, ములకలపల్లి రాములు, చినవెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement