పంటలు ఎండుతున్నా... నీళ్లివ్వరా?
Published Sat, Feb 4 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
- నేను మీ సబార్డినేట్‌ను కాదు... నేను చెప్పేది వినాలి
- జిల్లా కలెక్టర్‌ను నిలదీసిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య
- కలెక్టరేట్ ఎదుట రైతులతో కలసి ధర్నా
.
కర్నూలు(అగ్రికల్చర్):
‘‘ నేను మీ సబార్డినేట్‌ను కాదు... ప్రజాప్రతినిధిని, మీరు చెప్పిందే వినాలంటే ఎలా... పంటలు ఎండుతున్నాయి ... రైతులు అల్లాడుతున్నారు...నేను చెప్పేది కూడా వినాలి’’ అంటూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహను నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య నిలదీశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసి కెనాల్‌కు నీళ్లు ఇవ్వాలనే డిమాండ్‌తో శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే ఐజయ్య.. రైతులతో కలసి వచ్చారు. అయితే క్యాంపు కార్యాలయంలోకి ఎమ్మెల్యేతో పాటు మరో నలుగురుని మాత్రమే అనుమతి ఇచ్చారు. రైతులను లోనికి అనమతించకపోవడంతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం బయటనే ఉన్నారు. లోనికి వెళ్లిన ఎమ్మెల్యే.. నీటి విడుదలపై కలెక్టర్‌తో చర్చించేందుకు ప్రయత్నించారు. అయితే కలెక్టర్ వినకుండా తాను చెప్పేది వినాలని కాస్త గట్టిగానే అన్నారు. దీంతో ఎమ్మెల్యే తీవ్రంగానే స్పందించారు. తాను ప్రజాప్రతినిధినని, రైతుల పంటలు ఎండుతుంటే నీటి విడుదల కోసం మాట్లాడటానికి వచ్చానని.. అధికారులు రెండేళ్లు ఉంటారు, వెళ్లిపోతారని.. తాము చెప్పేది కూడా వినాలన్నారు. తర్వాత కలెక్టర్ నీటిపారుదల శాఖ ఎస్‌ఈని పిలిపించి నీటి విడుదలపై చర్చించారు. పంటలను ఎండనివ్వం, కేసికేనాల్‌కు నీళ్లు ఇస్తామంటూ ఎమ్మెల్యేకు హామీనిచ్చారు. అయితే ఎప్పటి నుంచి నీళ్లు ఇచ్చేది స్పష్టంగా చెప్పలేదు.
జలమండలిలో ఆమరణ దీక్ష చేపడతాం...
రైతులను సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఎమ్మెల్యే ఐజయ్య ధ్వజమెత్తారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు, హంద్రీనీవాకు 365 రోజులు నీళ్లు ఇస్తామని.. రైతులు పంటలు సాగు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి.. జనవరి 2న ప్రకటించారని గుర్తు చేశారు. అయితే జనవరి 18 నుంచి ముచ్చుమర్రి లిప్ట్ నుంచి కేసీ కెనాల్‌కు నీళ్లు విడుదల చేయడం బంద్ చేశారన్నారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు రైతులు దాదాపు 50 వేల ఎకరాల్లో వివిధ పంటలు వేశారని..నీరు లేక అవి ఎండిపోతున్నాయని, ఇందుకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఒక రకంగా, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను మరో రకంగా చూస్తున్నారని మండిపడ్డారు. పంటలు ఎండుతున్నా.. ఎప్పటి నుంచి నీళ్లు ఇచ్చేది చెప్పకపోవడం దారుణమన్నారు. ముచ్చుమర్రి లిప్ట్ నుంచి కేసి కెనాల్‌కు తక్షణం నీళ్లు ఇచ్చి పంటలను కాపాడకపోతే జలమండలిలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని ప్రకటించారు. నీళ్లు ఉన్నా పంటలకు ఇవ్వకపోవడం అన్యాయమని, సీఎం చంద్రబాబు.. అపర భగీరథుడుగా పోజులిచ్చి ఇప్పుడు పంటలు ఎండుతుంటే పట్టించుకోరా అంటూ ధ్వజమెత్తారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద కొద్దిసేపు రైతులతో ఎమ్మెల్యే ధర్నా చేశారు. పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు.
Advertisement