చిత్తశుద్ధి ఉంటే పేరూరుకు నీళ్లివ్వండి
మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి రూ.10 కోట్ల ఖర్చుతో నీళ్లివ్వచ్చు
నామమాత్రంగా అయ్యే ఖర్చులను రూ.850 కోట్లకు పెంచడం దోచుకునేందుకే...
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజం
రొద్దం: పేరూరు డ్యాంకు నీళ్లిస్తామని ఆర్భాట ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా డిసెంబరులోపు కృష్ణానీటితో పేరూరును నింపాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. హంద్రీ–నీవా ఫేజ్–2లోని బక్సంపల్లి సమీపంలో సాగుతున్న హంద్రీ–నీవా పనులను వారు మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్యాంకు నీళ్లివ్వాలనే చిత్తశుద్ధి ఉంటే మడకశిర బ్రాంచ్‌కెనాల్ 6వ లిప్ట్ తర్వాత 26 కిలోమీటర్ నుంచి తురకలాపట్నం, పెద్దకోడిపల్లి చెరువుల మీదుగా వంక ద్వారా 25 కిలోమీటర్లు నీరు పంపితే పేరూరు డ్యాంలోకి చేరుతుందని వివరించారు. దీనికి కేవలం రూ.10కోట్లు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఇంత తక్కువ ఖర్చుతో నీరిచ్చే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టుకు రూ.850 కోట్లు ఖర్చు పెట్టడం చూస్తే కేవలం దోచుకునేందుకు అంచనా వ్యయానికి భారీగా పెంచారనేది స్పష్టమవుతోందన్నారు. తమ అస్మదీయులకు ఆర్థికంగా లబ్దిచేకూర్చడం తప్ప డ్యాంకు నీరిచ్చే ఉద్దేశం కన్పించడం లేదన్నారు.
2015 ఆగష్టులోనే గొళ్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లిస్తామని ప్రకటించిన సునీత 2016 ఆగస్టు వచ్చినా ఎందుకు నీరివ్వలేదని ప్రశ్నించారు. అనంతపురం,హిందూపురంకు సంబంధించి 2.50 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సి ఉంటే వాటి ఊసే ఎత్తలేదని విమర్శించారు. హంద్రీ నీవా కాలువ పెన్నా, జయమంగళి నది దాటినప్పుడు పరిగి,రోద్దం మండలాలకు సబ్ సర్పేజ్ డ్యాంను ఏర్పాటు చేసి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్నానదిని అనుసంధానంచేసి నియోజక వర్గంలో ఉన్న చెరువులన్నింటికి నీళ్లు ఇవ్వాలన్నా రు. పచ్చచొక్కాలకు కమిషన్ల కోస మే రెయిన్‌గన్‌లు పెట్టారని ఆరోపించారు.