మెరుగైన వైద్యం అందించాలి
మెరుగైన వైద్యం అందించాలి
Published Wed, Jul 20 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
ఏటూరునాగారం : ఏజెన్సీలోని పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మా రెడ్డి అన్నారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీ పరిధిలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌సీల్లోని సమస్యలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే మెరుగైన వైద్యం తెలంగాణ రాష్ట్రం లో అందుతుందనే స్థాయికి తీసుకెళ్లాలన్నారు. సర్కారు వైద్యంపై ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టేలా వైద్య చికిత్సలు ప్రజలకు అందాలని కోరారు. ఈ రెండేళ్ల పాలనలో సర్కారు దవాఖానాల్లో ఓపీ, ఐపీ, డెలవరీలు పెరిగాయని వివరించారు. వరంగల్‌కు హెల్త్ హెడ్ క్వార్టర్‌గా పేరు రావడానికి స్థానిక మంత్రి చందూలాల్, జిల్లా కలెక్టర్ కరుణ, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కృషే కారణమన్నారు.
వందశాతం సౌకర్యాలు కల్పిస్తాం
సీఎస్‌సీలు, పీహెచ్‌సీలకు వంద శాతం సౌకర్యాలు కల్పించే బాధ్యత తమదని, మెరుగైన చికిత్సలు అందించే బాధ్యత వైద్యులపై ఉందని మంత్రి అన్నారు. ఇష్టంతో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని, డుమ్మాకొట్టే సిబ్బంది, వైద్యులపై చర్యలు తప్పవన్నారు. స్థానిక సామాజిక ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్ 15 రోజుల్లో చేసేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే పహరీ నిర్మాణంతోపాటు కౌంటింగ్ మిషన్, అల్ట్రా సౌండ్ స్కానర్, బెడ్స్, ప్రసూతి ఆస్పత్రికి సామగ్రి అందజేస్తామన్నారు.
సీజనల్ వ్యాధులపై దృష్టిపెట్టాలి
ఏజెన్సీలో సీజనల్ వ్యాధులపై అందరూ దృష్టిపెట్టాలని మంత్రి సూచించారు. 75 వేల దోమ తెరలు కావాలని మలేరియా జిల్లా వైద్యాధికారి పైడిరాజు మంత్రిని కోరారు. అవి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రం నుంచైనా వచ్చేలా చూస్తానని మంత్రి అన్నారు. ప్రతి ఆస్పత్రిలో ల్యాబ్ పరీక్షలు జరగాలని, బయటకు పంపించొద్దని చెప్పారు. పరీక్షలతో రోగాలు తెలిసి సరైన వైద్యం అందుతుందన్నారు. కళాజాత ప్రోగ్రాంలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావును ఆదేశించారు.
మూఢనమ్మకాలు వీడాలి
ఏజెన్సీ ప్రజలు మూఢనమ్మకాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, వాటిని వీడాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్ అన్నారు. రొయ్యూర్ పీహెచ్‌సీలో వైద్యులు లేక రోగులు రావడం లేదని, మూడు నెలల వరకు రోగుల సంఖ్య పెంచాలని వైద్యాధికారి రవికుమార్‌ను ఆదేశించారు. హరితహారం కూడా వైద్యశాఖకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలని సూచించారు. సమీక్షలో పీఓ అమయ్‌కుమార్, జెడ్పీటీసీ వలియాబీ, ఎంపీపీ మెహరున్నీసా, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీసీహెచ్‌ఓ సంజీవయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఏపీఓ వసంతరావుతోపాటు అధికారులు పాల్గొన్నారు. అనంతరం సీజనల్ వ్యాధులపై రూపొందించిన పోస్టర్‌ను మంత్రులు ఆవిష్కరించారు.
Advertisement
Advertisement