పీసీసీ అధ్యక్షునిపై విమర్శలు సరికాదు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: పార్టీలో సమస్యలుంటే అంతర్గత వేదికలపై చర్చించుకోవాలని, పీసీసీ అధ్యక్షునిపై బహిరంగంగా మాట్లాడటం సరికాదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇలా బహిరంగంగా మాట్లాడటం పార్టీకి ఏ కోణంలోనూ మంచిదికాదని, రాజకీయపార్టీల్లో గ్రూపు తగాదాలు సహజమని, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో మరణాలపై న్యాయ విచారణ జరిపించాలని, బాధితులకు 10 లక్షలు ఆర్థికసాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలకే మంత్రి లక్ష్మారెడ్డి పరిమితమైయ్యారని, శాఖను పట్టించుకోవడంలేదని పొంగులేటి విమర్శించారు. రైతు సమితుల పేరుతో టీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజనాన్ని కోరుకుంటున్నదని మండిపడ్డారు. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై టీఆర్‌ఎస్ నేతల దాడిని ఖండించిన పొంగులేటి నల్లగొండ పార్లమెంటుకు ఉప ఎన్నికలు కాదు, మొత్త రాష్ట్రంలో ఎన్నికలు జరిపితే టీఆర్‌ఎస్ అసలు బలం ఏమిటో తేలిపోతుందన్నారు. అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ లేకుండా టీఆర్‌ఎస్ ఎక్కడా గెలవదని జోస్యం చేప్పారు.